కరీంనగర్, మే 26 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. తొలి ఏడాది 4.16 లక్షల మందికి ఇండ్లు కట్టిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను నమ్మించి నట్టేట ముంచిందని వాపోయారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన 77.18 లక్షల దరఖాస్తులను పరిశీలించిన సర్కారు 36.03 లక్షల మందిని మాత్రమే అర్హులని ప్రకటించిందని, మిగతా 41.15 లక్షల మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు వేసి ఇందిరమ్మపేరుతో కేటాయిస్తున్నారని ఆరోపించారు. కారు, వ్యాను, ట్రాక్టర్ తదితర నాలుగు చక్రాల వాహనాలు ఉంటే ఇందిరమ్మ ఇంటికి అనర్హులుగా తేల్చుతున్నారని, ఇది దళితబంధు లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు.
శ్లాబ్ దశలో 64 ఇందిరమ్మ ఇళ్లు ; మంత్రి పొంగులేటి వెల్లడి
హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 64 ఇందిరమ్మ ఇండ్లు శ్లాబ్ దశకు చేరుకున్నాయని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లు మంజూరు చేయగా, అందులో ఇప్పటి వరకు 7,824 ఇండ్లు బేస్మెంట్ దశకు, 895 ఇండ్లు గోడలు, 64 ఇండ్లు శ్లాబ్ దశకు చేరుకున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సోమవారం రూ. 14.44కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ. 68.08కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. లబ్ధిదారులు తమ ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా, 600 చదరపు అడుగులకు మించకుండా ఇల్లు నిర్మించుకోవచ్చని సూచించారు.