హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ఊసరవెల్లిని మించి సీఎం రేవంత్రెడ్డి మాటలు మారుస్తున్నాని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో విమర్శించారు. వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి.. సంక్రాంతికి ఇస్తామని మరోసారి మాట తప్పారని ధ్వజమెత్తారు. జనవరి 26న ఇస్తామని చెప్పి మార్చి 31 వరకు అని మాట మార్చడమే మరో నిదర్శనం అని పేర్కొన్నారు. ఇప్పుడే తీసుకుంటే రైతుబంధు రూ.10 వేలు, 2023 డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే రూ.15 వేల రైతు భరోసా అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి రైతులను నమ్మించి గొంతు కోశారని మండిపడ్డారు. ఇలా పలు అంశాల్లో మాట తప్పారని తెలిపారు. ముఖ్యంగా అన్నదాతలను నమ్మించి రేవంత్రెడ్డి సరార్ మోసం చేసిందని, రైతులు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయారని తెలిపారు.
రేవంత్ మాటలను నమ్మి రైతులు ఆగమయ్యారని, కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లే మిగిల్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. బ్యాంకులో పంట రుణం తీసుకున్నందుకు వడ్డీ వసూలు కింద కల్యాణలక్ష్మి సాయాన్ని జమ చేసుకుంటున్నారని మండిపడ్డారు. ‘2023 డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. పూచీ నాది. రుణాలు తెచ్చుకోని వారు పరుగెత్తి తెచ్చుకోండి’ అని ప్రగల్భాలు పలికిన రేవంత్రెడ్డి.. 2024 ఆగస్టు 15 వరకు రుణమాఫీ గడువు పొడిగించారని గుర్తుచేశారు. దసరా వరకు రుణమాఫీ అని చెప్పినా నేటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ కాలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ సీజన్ మొత్తానికి పెట్టుబడి సాయం బంద్ చేసి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల కోసమే పథకాల పేరిట మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు.