జగిత్యాల, జనవరి 7 : కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఎస్సీ స్టడీ సర్కిళ్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రెండేండ్ల నుంచి రాష్ట్రంలో స్టడీ సరిళ్లలో బోధన నిలిచిందని, ప్రవేశాలు కరువయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. బుధవారం బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి కొప్పుల జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టడీ సరిళ్లు క్రమంగా తమ ప్రాభవం కోల్పోతూ వచ్చాయని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ఎస్సీ స్టడీ సరిళ్లలో హైదరాబాద్ మినహాయించి మిగిలిన అన్ని స్టడీ సరిళ్లలో 17 నెలలుగా శిక్షణ నిలిచిపోయిందని తెలిపారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉండగా, ఆ విధానానికి మంగళం పాడారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎస్సీ స్టడీ సరిల్ సూపర్ సక్సెస్‌గా నడిచాయని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒక్కోవర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో 132 స్టడీ సర్కిళ్లను కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. స్టడీ సర్కిళ్లు, కేవలం పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే శిక్షణ కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన జగిత్యాల ఎస్సీ స్టడీ సరిల్ గతేడాది ఆగస్టు 17 నుంచి అడ్మిషన్లు లేక మూతపడిందని, నిధుల మంజూరు లేకపోవడం, భవనాల అద్దె, ఇతర వసతులు లేకపోవడంతో తాళాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.