జగిత్యాల, సెప్టెంబర్ 20: ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పేదలకు అన్యాయం చేశారని, ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఈ పథకం ఫెయిల్ అయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఆయన జగిత్యాలలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇల్లు మంజూరు కావాలంటే సర్కార్ మరో కొత్త మెలిక పెట్టిందని ధ్వజమెత్తారు. కారు, వ్యాన్, ట్రాక్టర్, తదితర నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులుగా తేల్చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధులో వాహనాలు తీసుకున్న వారికి ఇల్లు రావడం లేదని అన్నారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 10,700 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, 7,261 మంది ముగ్గు పోశారని, 2,569మంది బేస్మెంట్, 468 మంది గోడల నిర్మాణం పూర్తి కాగా 165 స్లాబ్ దశకు వచ్చాయని తెలిపారు. ఇప్పటివరకు ఒకటి కూడా పూర్తయిన దాఖలాలు లేవని అన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజాపాలనలో 77.18 లక్షల దరఖాస్తులు రాగా, అందులో 36.03 లక్షల మందిని మాత్రమే ప్రభుత్వం అర్హులుగా ప్రకటించిందని, మిగిలిన 41.15 లక్షల మందికి ఇండ్లు పొందే అర్హత లేదా? అని ప్రశ్నించారు. 600 చదరపు అడుగుల స్థలం మించి నిర్మాణం చేపట్టిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తించదని చెల్లింపులను నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూంలను కాంగ్రెస్ రంగులు మార్చి పంపిణీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్రావు పాల్గొన్నారు.