ఆదిలాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని చనాక-కొరాట ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జిల్లా పర్యటనకు వచ్చారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారన్న నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో రామన్న ఇంటివద్ద పోలీసులు మోహరించారు. సీఎం పర్యటన నేపథ్యంలో రామన్నను హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, విజ్జిగిరి నారాయణ, సాజిదొద్దీన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి ప్రాజెక్టు భూ నిర్వాసితులు తమకు పరిహారం ఇవ్వాలంటూ ఆందోళనలు చేపట్టగా.. రైతులు నసీరొద్దీన్, దొంతుల స్వామిని అరెస్ట్ చేసి భీంపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు నిర్బంధం మధ్య ముఖ్యమంత్రి పర్యటన కొనసాగింది.
రైతులను మోసం చేయడానికి ట్రయల్ రన్
చనాక-కొరాట ప్రాజెక్టు కాలువల నిర్మా ణం పూర్తిస్థాయిలో కాకముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాలువల్లోకి నీటిని విడుదల చేశారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా తన ఇంటివద్ద కార్యకర్తలతో కలిసి నల్లాబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రైతులను మోసం చేయడానికే ప్రాజెక్టు కాలువల్లోకి నీటిని విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రయల్న్ నిర్వహించామని గుర్తుచేశారు. ఓట్ల కోసం మోసాలకు పాల్పడటం సీఎంకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1200 కోట్లతో ప్రాజెక్టును నిర్మించిందని చెప్పారు. రెండేండ్లుగా గుర్తుకురాని ప్రాజెక్టు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు.