Jeevan Reddy | జగిత్యాల, ఏప్రిల్ 13 : ఉద్యమకారుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తో కలిసి నడవడం తన అదృష్టంగా భావిస్తున్నానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. సహజంగా ప్రతిపక్షంలో ఉండే ఎవరైనా అధికార పార్టీకి వెళ్తారని, కానీ, తాను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నాని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయడమే తన కర్తవ్యమని, తె లంగాణ ఉద్యమం తరహాలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తామని స్పష్టంచేశారు.
జగిత్యాల ఉద్యమ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని శ్రేణులు, అనుచరులకు పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాలలోని తన నివాసంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి ఊరి నుంచి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి విజయవంతం చేయాలని జీవన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలనే బా గుండే అనే చర్చ వచ్చిందని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి’ అనే నినాదం ప్రజల నుంచి వస్తున్నదని తెలిపారు.