హైదరాబాద్ : మలేషియా ( Malaysia ) తెలంగాణ అసోసియేషన్ , బీఆర్ఎస్ మలేషియా సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6 న కౌలాలంపూర్‌లో జరిగే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ( Telangana Formation Day ) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు ( KTR ) పాల్గొంటున్న కార్యక్రమ బ్రోచర్‌ను మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి ( MLA Jagadish Reddy ) ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కేసీఆర్ పేరును గుర్తు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ లేని లోటు రెండున్నర ఏండ్లుగా కనిపిస్తుందని వెల్లడించారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతుందని, కేసీఆర్ ఇచ్చిన పథకాలనూ ఇవ్వలేక పోతుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
అమెరికా దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో గతంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డల్లాస్‌లో జరిగాయని వివరించారు. దేశంలో బీజేపీ పాలనలో చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న నిందితులను పట్టుకునే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఖరీఫ్ సీజన్ త్వరంలో ప్రారంభమవుతుందని, రైతులకు విత్తనాలు ,ఎరువులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాత గురువు, చీకటి గురువు చెప్పినట్లు రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారని మండిపడ్డారు .
రైతాంగాన్ని ముంచి వ్యవసాయ సబ్సిడీలు దోచుకోవాలనే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిన ట్వీట్ చేసే రాహుల్ గాంధీ తెలంగాణలో మైనర్ బాలిక ఘటన పై ఎందుకు ట్వీట్ చేయ లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణ ప్రజలకు , మహిళలకు శ్రీరామ రక్ష అని అన్నారు .
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెసిడెంట్ మహేష్ బిగాల, మైటా ప్రెసిడెంట్ తిరుపతి,ఉమెన్స్ వింగ్ సుప్రియ, బీఆర్ఎస్ మలేసియా ప్రెసిడెంట్ చిట్టీ బాబు, శివ, రాష్ట్ర నాయకులు నరసింహ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి, పడాల సతీష్, రవి యాదవ్ పాల్గొన్నారు.