గుర్రంపోడ్, ఏప్రిల్ 21: యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు ఒక తడికి కూడా నీరివ్వక, పంటలను ఎండబెట్టిన అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని, మాయమాటలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా గుర్రంపోడ్, కనగల్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా.. ఇకడి నుంచి కాల్వల్లోకి నీళ్లు వెళ్లినా పంటలకు మాత్రం నీరివ్వలేదని విమర్శించారు. దీంతో రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఉంటే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు వస్తాయని రైతులకు తెలిసిందని చెప్పారు. పంటలను కాపాడాల్సిన బాధ్యత గల సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు రైతులను ఆదుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రూ.4వేల పింఛన్ ఇస్తామని, రూ.2 లక్షల రుణమా ఫీ చేస్తామని హామీ ఇచ్చి వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నోముల భగత్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.