హైదరాబాద్ : ఇవాళ అసెంబ్లీలో మూసీ ప్రక్షాళనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఈ అంశంపై సీఎం మాట్లాడిన తర్వాత మాట్లాడేందుకు బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వలేదు. బీఆర్ఎస్ సభ్యులు ముఖ్యమంత్రిని దూషిస్తున్నారని, ముఖ్యమంత్రిని దూషిస్తానంటే మైక్ ఇవ్వనని స్పీకర్ చెప్పారు.
దాంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే ‘ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వను’ అన్న స్పీకర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తప్పుపట్టారు. ‘ముఖ్యమంత్రిని విమర్శించకపోతే ప్రతిపక్షం ఎక్కడన్నా ముఖ్యమంత్రికి డబ్బా కొడుతదా..?’ అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు.
సభ్యులు ముఖ్యమంత్రిని పొగడడానికి సభకు వస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి మూసీ కంపును అంతా తీసుకొచ్చి తన నోటి ద్వారా అసెంబ్లీలో వదిలిండని విమర్శించారు. ప్రధానమైన ప్రతిపక్షంగా తాము ప్రజల తరుపున ప్రశ్నలు అడుగుతామని అన్నారు. పేద ప్రజల ఇళ్లు కూలకొడితే వాళ్లకు అండగా ఉంటామని చెప్పారు.
ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు దాడిచేసి, మాకు మైక్ ఇవ్వకుండా వేరే ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. సబితా ఇంద్రారెడ్డిగారు, సునీతా లక్ష్మారెడ్డిగారు మూసీ ప్రస్తావన తీసుకురాగానే వారి మైక్ కట్ చేశారని చెప్పారు. స్పీకర్ వైఖరికి నిరసనగా తాము సభను బాయ్ కాట్ చేశామని తెలిపారు.