హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. చట్టసభల్లోకి ప్రతిపక్ష సభ్యులను రానీయకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. శాసనమండలిలో చైర్మన్, శాసనసభలో స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరించాలని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి పార్లమెంటరీ సంప్రదాయాలను అభాసుపాలు చేయొద్దని కోరారు. రేవంత్ ధనదాహం వెనుక అదానీ భూదాహం దాగి ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అదానీపై రాహుల్‌గాంధీ చేసిన నిరసన ఒప్పు అయినప్పుడు, తాము ఇక్కడ చేసింది తప్పెట్టా అవుతుందని నిప్పులు చెరిగారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, విజయుడుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. శాసనమండలి, శాసనసభల్లోకి ప్రధాన ప్రతిపక్ష సభ్యులను రానీయకపోవడం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చని, ఆ చర్య చీకటి రోజని సిరికొండ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. అదానీ విషయంలో రాహుల్‌గాంధీ వైఖరికి, సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి భిన్నంగా ఉన్నదని తెలిపారు.
తెలంగాణ సంపద అదానీకి దోచిపెట్టే కుట్ర: జగదీశ్‌రెడ్డి
అదానీకి తెలంగాణ సంపదను దోచిపెట్టేందుకే రేవంత్ కుట్ర పన్నుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ, లగచర్లలో పరిశ్రమలు అదానీ కోసమేనని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ధనదాహం వెనుక అధానీ భూదాహం దాగి ఉన్నదని తెలిపారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే క్రమంలో భాగంగా తాము తొలిరోజు అదానీ, రేవంత్ ఫొటోలు, స్టిక్టర్లున్న టీ-షర్టులను ధరించామని, టీ షర్టులు వేసుకోవడం నేరమన్నట్టు ప్రభుత్వం వ్యవహరించి అసలు తమను లోపలికే అనుమతి ఇవ్వకుం డా అసెంబ్లీ గేటు బయటే పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గ చర్య అని పేర్కొన్నారు. పార్లమెంట్లో రాహుల్‌గాంధీ ప్రధాని, అదానీ ఫొటోలనే కాకుండా ఏకంగా వారి మాస్క్‌లను ధరించి నిరసన తెలిపారని, అవే సంప్రదాయాలు ఇక్కడ ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. అదానీపై రాహల్ నిరసన తెలిపేతే ఒప్పెట్ట? తాము అదే అదానీపై ఇక్కడ నిరసన తెలిపితే తప్పెట్ట? అవుతుందని ప్రశ్నించారు.
కేసీఆర్ దీక్షాఫలమే తెలంగాణ
ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష ఫలం తెలంగాణ అని సిరికొండ మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. అమరుల ఆత్మత్యాగాలు, తెలంగాణ ప్రజల అలుపెరుగని పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని తేల్చిచెప్పారు. డిసెంబర్ 9వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఎలా వచ్చిందో దేశ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. సమైక్యవాదులకు బానిసగా ఉంటూ తెలంగాణ వాదులపైకే తుపాకీ ఎక్కుపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈరోజు ఎన్నిమాటలు చెప్పినా ఎవరూ నమ్మరని చెప్పారు.