హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్లలో రూ.1100 కోట్లకుపైగా చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయని, దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం పారిపోయిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం సభ నుంచి వాకౌట్ అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను స్పీకర్ ముందు పెట్టాలని, సభా సంఘం వేయాలని నిబంధనల ప్రకారమే అడిగామని పేర్కొన్నారు. ప్రభుత్వం తిరస్కరిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. దొరికిపోయిన దొంగ ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. దొడ్డు వడ్లకు ఎమ్మెస్పీకి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకే అంటూ తప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు సన్నవడ్లను బయటే అమ్ముకుంటారని, సివిల్ సప్లయిస్‌కు వచ్చే వడ్లలో 90 శాతం దొడ్డు వడ్లే ఉంటాయని చెప్పారు. ఆ రైతులను ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.