సూర్యాపేట, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సాగునీటి కాల్వలు తెగడానికి ఎవరు కారణమో తేల్చేందుకు విచారణకు సిద్ధమా? అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం సాగర్ ఎడమ కాల్వ గండి మరమ్మతు పనులను మంత్రి ఉత్తమ్ పరిశీలించిన సందర్భం గా ఎడమ కాల్వకు గండ్ల పాపం గత ప్రభుత్వ నిర్వాకం అనడంపై జగదీశ్‌రెడ్డి తీవ్ర స్థాయి లో విరుచుకుపడ్డారు. ‘మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు బీఆర్ఎస్పై నిందలు వేస్తారా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఐదేండ్లలో చేయాల్సిన తప్పులను పది నెలల్లోనే చేసిందని, ప్రజలు అన్నీ లెక్కకడుతున్నారని అన్నారు. మంత్రులు తమ వైఫల్యాలను అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
దుర్మార్గంగా గేట్లకు లాకులు, వెల్డింగులు పెట్టడంతోనే కాల్వలు తెగాయని, ఈ విషయం తెలిసినప్పటికీ 24 రోజుల తరువాత ఆలోచించి కాల్వ గండ్లపై పచ్చి అబద్ధాలు ఆడటం సిగ్గుచేటని అన్నారు. ఖమ్మం మంత్రుల అత్యుత్సాహం, నల్లగొండ మంత్రుల చేతగానితనంతోనే సాగర్ ఎడమ కాల్వ కట్టలు తెగిపోయాయని ఆరోపించారు.
హడావిడి పనులతో నాసిరకంగా మరమ్మతులు చేస్తున్నారని, వాటిని కప్పిపుచ్చుకోవడానికి కింది స్థాయి అధికారుల మీద అరవడం మానుకొని, పొలాలకు నీళ్లు అందించాలని హితవుపలికారు.24 రోజులు గడుస్తున్నా పొలాలకు నీళ్లు అందడం లేదని, మంత్రులు పరిపాలన వదిలి ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారని విమర్శించారు. గతంలో కాల్వలు తెగితే వారం రోజుల్లోనే నీళ్లందించిన విషయాన్ని గుర్తుచేశారు. తక్షణమే 24 గంటలు షిఫ్టుల వారీగా పనిచేయించి మరమ్మతులు పూర్తి చేసి పొలాలకు నీళ్లందించాలని డిమాండ్ చేశారు.