హైదరాబాద్, మార్చి 2 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రంలో పొద్దుతిరుగుడు గింజల కొనుగోళ్లను వెంటనే చేపట్టాలని, కొనుగోలు కేంద్రాలను సోమవారం నుంచే ప్రారంభించాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన బహిరంగలేఖను ఆదివారం విడుదల చేశారు. పొద్దుతిరుగుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించారని ఆయన కోరారు. పంట చేతికొచ్చిన దశలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. సన్‌ఫ్లవర్ నూనె గింజలకు నాఫెడ్ రూ.7,280 మద్దతు ధర ప్రకటించిందని, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు మధ్య దళారులకు 5,500 నుంచి రూ.6,000కే విక్రయిస్తున్నారని, ఫలితంగా క్వింటాకు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు నష్టపోతున్నారని తెలిపారు. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతుల్లో చైతన్యం తెచ్చాం. సమయానుగుణంగా రైతుబంధుతోపాటు సబ్సిడీలు అందజేసి నూనెగింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాం. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. మేము అందించిన ప్రోత్సాహంతో ఇప్పుడు రైతులు పెద్ద ఎత్తున నూనె పంటలను సాగుచేస్తున్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు (సన్ ఫ్లవర్) పంట కోతకు వచ్చింది. ఈ దశలో కొనుగోలు కేంద్రాలు లేక రైతులు అయోమయంలో పడ్డారు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
‘ప్రభుత్వ అలసత్వం కారణంగా తెలంగాణ వ్యవసాయరంగం తిరోగమన దిశలో పయనిస్తున్నది. నూనె పంటలు వేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితులను కల్పిస్తున్నారు. ఇప్పటికైనా కండ్లు తెరవండి. క్షేత్రస్థాయిలో సన్‌ఫ్లవర్ పంట రైతుల కష్టాలను తొంగి చూడండి. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సన్‌ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా ఆదేశించండి. ఎన్నికల కోడ్‌తో రైతుల కష్టాలను ముడిపెట్టకుండా సీఎంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎంకు రాసిన లేఖలో హరీశ్‌రావు పేర్కొన్నారు.