నీలగిరి, నవంబర్ 16 : ఉద్యమకారుడిగా, పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేసిన మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు సరికాదని నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనకు కేసీఆర్ పార్టీని స్థాపించినప్పుడు, ఉద్యమంలో హరీశ్‌రావు పాత్ర ఏమిటో కార్యకర్తలకు తెలుసని అన్నారు. హరీశ్‌రావు పోరాటం చేస్తున్నప్పుడు కవిత విదేశాల్లో ఉన్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తరువాత ఆమె జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజాసమస్యలపై ప్రశ్నించకుండా కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలిస్తే ఒరిగేదేమీ ఉండదని, అధికార పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ఆమె పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించినట్టు తెలిపారు.
కేటీఆర్‌కు అండగా ఉండే హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డిపై అరోపణలు చేస్తూ వారిని పార్టీకి దూరం చేసి, కేటీఆర్‌ను ఒంటరి చేసేందుకు రేవంత్‌రెడ్డి పన్నిన కుట్రలో కవిత పావుగా మారినట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలే కవిత మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా మారి, హరీశ్‌రావును ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి పేరుతో కవిత వస్తే కేసీఆర్ బిడ్డ అనే గౌరవంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హారతులు పట్టినట్టు తెలిపారు. హరీశ్‌రావును బయటికి పంపేందుకు అవినీతి మరక అంటించి పార్టీని చీల్చే కుట్ర జరుగుతున్నదన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓడినంత మా త్రాన ఉద్యమకారులమైన తాము అధైర్యపడబోమని, అడ్డదారిలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మాయలో కవిత పడొద్దని సూచించారు.