Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్థానికతను నిర్ధారించుకోలేక విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వ పాలన గుడ్డెద్దు చేలోపడ్డట్టు, గాలిలో దీపం పెట్టినట్టు సాగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. జీవో 33 విద్యార్థులు, తల్లిదండ్రుల పాలిట అశనిపాతంగా మారిందని, తెలంగాణ బిడ్డలే స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలోని విద్యాలయాల్లో ప్రవేశాలకు విభజన చట్టం ప్రకారం 2024 జూన్ 2 దాకా పాత పద్ధతే కొనసాగించాల్సి వచ్చిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా పదేండ్లు ముగిసినందున తెలంగాణ స్థానికతను నిర్ధారించుకోవాల్సి ఉన్నదని అన్నారు.
ఇంటర్‌తోపాటు మెడికల్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా.. ఇలా అన్ని స్థాయిలు, అన్ని విద్యాలయాల్లో అడ్మిషన్లకు సొంత విధానాన్ని రూపొందించుకోవాల్సి వచ్చినా.. దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఆ పనిచేయలేదని విమర్శించారు. స్థానికత విషయంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ర్టాలు సొంత విధానాలు రూపొందించుకున్నాయని.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ, న్యాయ విభాగాధిపతులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యావంతులు, విషయ నిపుణులతో సమాలోచనలు జరిపి, ఒక ఉన్నతస్థాయి కమిటీవేసి విధాన నిర్ణయం తీసుకోవాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్విభజన గడువు ముగిసే 6-7 నెలల ముందే ఈ కసరత్తు ప్రారంభం కావాల్సి ఉన్నదని, ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందని ప్రశ్నించారు. ఇప్పుడు హడావుడిగా అస్తవ్యస్థ ఉత్తర్వులు జారీచేసి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు.
ఇప్పుడు తెలంగాణ బిడ్డలే స్థానికేతరులు
మెడికల్ విద్యార్థుల పాలిట అశనిపాతంలా మారిన జీవో 33ను సవరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా తాము కూడా ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు. 1979లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం విద్య, ఉద్యోగాల విషయంలో 646 జీవో విడుదల చేసిందని చెప్పారు. దాని ప్రకారం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 85 సీట్లు స్థానికతగా, 15 శాతం ఓపెన్ క్యాటగిరీగా పేర్కొన్నారని గుర్తుచేశారు. 2014 రాష్ట్ర విభజన చట్టంలో పదేండ్లపాటు విద్యాలయాల ప్రవేశాల్లో ఇదే నిబంధనను యథాతథంగా అమలు చేయాలని స్పష్టం చేసిందని.. ఈ నేపథ్యంలోనే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి 2017లో అదే జీవోను యథావిధిగా కొనసాగించామని తెలిపారు.
ఈ జీవో ఈ ఏడాది జూన్ 2 వరకు మాత్రమే వర్తించిందని చెప్పారు. ‘ఈ ఏడాది మెడికల్ అడ్మిషన్లలో స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ జీవో 33 ఇచ్చింది. ఇది తెలంగాణ విద్యార్థులకు, భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం, నష్టం జరుగుతుంది. డాక్టర్ కావాలని పిల్లలు, వారి తల్లిదండ్రులు కన్న కలలను రాష్ట్ర ప్రభుత్వం ఛిద్రం చేసింది. 1979, 2017లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రెండు అంశాలనే కొత్త జీవోలో పొందుపరిచి దాన్నే స్థానికతగా పేర్కొనటం దుర్మార్గం. ప్రభుత్వం కనీస అధ్యయనం లేకుండా ఉత్తర్వులు ఇవ్వటం వల్ల తెలంగాణ బిడ్డలే తెలంగాణలో స్థానికేతరులుగా మారే ప్రమాదం ఉన్నది.
చివరి విద్యాసంవత్సరానికి నాలుగేండ్లు ముందు చదివిన ప్రాంతాన్నే స్థానికతగా ప్రభుత్వం జీవో 33లో చెప్పింది. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు నాలుగేండ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికతగా పేర్కొనటం దారుణం. నీట్ పరీక్ష రాయటానికి ముందు గడచిన ఏడేండ్లు తెలంగాణలోనే చదవాలని లేదా గరిష్ఠంగా నాలుగేండ్లు చదివినా లోకల్ అవుతారన్న నిబంధనను ఎత్తగొట్టారు. విద్యార్థులు ఇంటర్ తెలంగాణ ప్రాంతం అవతల చదివితే వారికి మెడికల్ సీట్లలో స్థానికత కోటా వర్తించదా?’ అని ప్రశ్నించారు.
ప్రభుత్వం తెచ్చిన జీవోతో గుంటూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు నాన్‌లోకల్ అయిపోతారని, ఇదేం విధానం? అని నిలదీశారు. నీట్లో మంచి ర్యాంకు వచ్చి ఇతర రాష్ర్టాల్లో.. ప్రాంతాల్లో ఎంబీబీఎస్ చదివిన వారు ఇక్కడ పీజీ చేయకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ తెలంగాణకు నాన్‌లోకల్ కావాల్సిందేనా? అని నిప్పులు చెరిగారు.
తెలంగాణ బిడ్డలకే దక్కేలా చేశాం
‘తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండేవి. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల సంఖ్యను 20 నుంచి 36కు పెంచారు. దీంతో సీట్ల సంఖ్య దాదాపు 9 వేలకు చేరింది. పెరిగిన సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కాలని అనేక జాగ్రత్తలు తీసుకున్నాం. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మెడికల్, ఇంజనీరింగ్ సహా అన్ని విద్యాలయాల అడ్మిషన్లలో 15 శాతం ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి. ఈ మేరకు 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో 280 సీట్లు ఓపెన్ కాంపిటీషన్‌కు వెళ్లేది. ఏపీలోని కాలేజీల్లోనూ 15 శాతం నిబంధన అమలైంది.
వీటికి తెలంగాణ, ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉండేది. పదేండ్లు ఈ నిబంధన కొనసాగించాలని చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో మేం మార్చలేకపోయాం. అయితే.. చట్టంలో పేర్కొన్నట్టుగా 20 కాలేజీలకే దానిని పరిమితం చేస్తూ.. 2014 తర్వాత స్థాపించిన కాలేజీలకు 15 శాతం ఉమ్మడి కోటా ఎత్తివేశాం. ఫలితంగా తెలంగాణ బిడ్డలకు అదనంగా 520 సీట్లు వచ్చాయి. అదేవిధంగా బీ క్యాటగిరీ (ప్రైవేట్ మెడికల్ కాలేజీలు) సీట్ల విషయంలోనూ పటిష్టమైన విధానాన్ని అమలు చేశాం. అంతకుముందు బీ-క్యాటగిరీలో దేశంలోని ఏ రాష్ట్రంవారైనా చదువుకోచ్చనే నిబంధన ఉండేది. అయితే తెలంగాణ బిడ్డలకే ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో జీవోను సవరించాం. తద్వారా 24 మెడికల్ కాలేజీల్లో 1,071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ సీట్ల అడ్మిషన్ల భర్తీ విషయంలో అనాలోచితంగా వ్యవహరించింది. మన విద్యార్థులకు తీరని నష్టం జరిగేలా ప్రభుత్వం జీవో 33 తెచ్చింది’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
మొక్కుబడిగా పచ్చదనం
రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం-పచ్చదనం ప్రారంభించటాన్ని స్వాగతిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. గతంలో వర్షాలు రాకముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టామని..
కాంగ్రెస్ ప్రభుత్వం పథకం పేరును మార్చిందే తప్ప, స్థానిక సంస్థలకు నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు. మొదటి రోజు సమస్యలను గుర్తించాలని, రెండో రోజు ఓహెచ్ఆర్ఎస్ క్లీనింగ్, తాగునీటి పైపుల బాగు చేయాలని.. కానీ బ్లీచింగ్ పౌడర్‌కు డబ్బులు లేవని, గడ్డి మందుకు, ఆయిల్ బాల్స్‌కు, కనీసం బల్బులు మార్చేందుకు కూడా డబ్బులు లేవని తెలిపారు.
సర్పంచులు ఉన్నప్పుడు రూ.2-3 లక్షలు, ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు రూ.60-70 వేల వరకు సొంత డబ్బు ఖర్చు చేశారని వెల్లడించారు. చాలా ఊర్లలో డీజిల్‌కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకుపడ్డాయని, పారిశుద్ధ్య కార్మికులకు 2 నెలల వేతనాలు పెండింగ్ ఉన్నాయని.. మరి స్వచ్ఛదనం, పచ్చదనం ఎలా సాధ్యం అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో హరితహారం 3-4 నెలలు పండుగలా సాగేదని, నేడు మొకుబడి కార్యక్రమంగా మారిందని విమర్శించారు. తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎంను డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను బట్టి ప్రభుత్వ పాలన గుడ్డెద్లు చేన్లో పడ్డట్టుగా ఉన్నదని, ఏ అంశంలోనూ స్పష్టత, ప్రణాళిక, సమగ్రమైన విధానం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నియామకాల్లో స్థానికత నిర్ధారించాం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలపై జరిగిందనే విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. నియామకాలపై కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలను నిజం చేసిందని.. మన ఉద్యోగాలు మన బిడ్డలకే దక్కేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగిందని వెల్లడించారు. ఒకప్పుడు 60 శాతం లోకల్, 40 శాతం నాన్‌లోకల్ అని రిజర్వేషన్లు ఉండేవని.. ఓపెన్ కాంపిటీషన్లో పక్క రాష్ట్రం వాళ్లే ఎక్కువగా ఉద్యోగాలు పొందేవారని చెప్పారు. దీనిని బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని వివరించారు. కేసీఆర్ స్వయంగా ప్రధాని, రాష్ట్రపతిని కలిసి 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారని పేర్కొన్నారు. 2018లో జీవో 124ను కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిందని వెల్లడించారు. దాంతో ఉద్యోగాల నియామకాల్లో స్థానిక రిజర్వేషన్లు సాధించుకున్నామని స్పష్టంచేశారు. విద్య విషయంలోనూ పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలని భావించినా.. పునర్విభజన చట్టం అడ్డంకిగా ఉండటంతో సాధ్యం కాలేదని, ఇప్పుడు గడువు ముగిసినా స్థానికతను నిర్ధారించుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని విమర్శించారు.