మెదక్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో కాంగ్రెస్ నాయకులు గజగజ వణుకుతున్నారని, అందుకే ఎక్కడిపడితే అక్కడ దేవుని మీద ఒట్లు పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్‌షోలలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రేవంత్‌రెడ్డికి పాలన చేతకాక తిట్ల పురాణం అందుకున్నారని విమర్శించారు. తిట్లు, లేదంటే ఒట్లు తప్ప ప్రజలు, రైతుల సమస్యలపై ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. ఆరు గ్యారెంటీలు అమలుచేస్తే రాజీనామా చేస్తానని, ఎన్నికల్లో మళ్లీ పోటీచేయబోనని సవాలు విసిరితే రేవంత్ తోకముడిచి పారిపోయారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్‌వి ఉద్దెర మాటలు తప్ప, ప్రజలను ఉద్ధరించింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రచారం కోసం కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టేందుకు చీపుర్లు పట్టుకుని రెడీగా ఉండాలని, గుంపుమేస్త్రి గూబ గుయ్‌మనేలా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఓట్లలోనూ కాంగ్రెస్‌కు తరుగుపెట్టాలి
పంట ఉత్పత్తులకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మాటతప్పిందని హరీశ్‌రావు మండిపడ్డారు. వరి కొనుగోళ్లలో తరుగు పెడుతున్న కాంగ్రెస్‌కు ఓట్లలోనూ తరుగుపెట్టి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మెడలు వంచేది బీఆర్ఎస్ ఒక్కటేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు, మోటర్లు కాలుడు ప్రారంభమైందని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు ఓటేస్తే నీళ్లు లేని బావిలో దూకినట్టేనని హెచ్చరించారు. ధరల పెంపు, మత రాజకీయాలు తప్ప అభివృద్ధి, తెలంగాణ ప్రయోజనాలకు ఆ పార్టీకి పట్టవని హరీశ్‌రావు విమర్శించారు.
కేసీఆరే శ్రీరామరక్ష
తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, ప్రజలకు కేసీఆరే శ్రీరామ రక్ష అని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హయాంలో బావి దగ్గర 24 గంటల కరెంటు వస్తే, ఇప్పుడు 14 గంటలు మాత్రమే వస్తున్నదని తెలిపారు. మహిళలకు కేసీఆర్ రూ.2 వేల పింఛన్ ఇస్తే, రూ. 4 వేలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 4 వేల పెన్షన్ వచ్చిన వారు కాంగ్రెస్‌కు, రూ. 2 వేలు తీసుకుంటున్నవారు బీఆర్ఎస్కు ఓటెయ్యాలని కోరారు. హరీశ్‌రావు రోడ్‌షోలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. కాంగ్రెస్ మోసాలను వివరిస్తున్నప్పుడు మంచి స్పందన లభించింది. రోడ్‌షోలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.