అంబర్‌పేట, నవంబర్ 20 : ఎంతో మంది అత్యద్భుతమైన గొప్ప గొప్ప ఇంజినీర్లు, సైంటిస్టులను దేశానికి అందించిన విద్యావేత్త చుక్కా రామయ్య అని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య 100వ జన్మదినోత్సవం సందర్భంగా గురువారం విద్యానగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ సమాజంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి చుక్కా రామయ్య అని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో చుక్కా రామయ్య అంటే తెలియని వారుండరని, తెలుగు ప్రజలకు, దేశానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
ఐఐటీ అంటే రామయ్య… రామయ్య అంటే ఐఐటీ అనే గొప్ప పేరు తెచ్చుకున్నారని తెలిపారు. సమాజ సేవ, సమాజ హితం, సామాజిక బాధ్యత కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారని చెప్పారు. చుక్కా రామయ్య సిద్దిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పని చేస్తున్న సమయం నుంచి ఆయనతో అనుబంధం ఉన్నదని గుర్తుచేసుకున్నారు. ఎప్పుడైనా ఎవరు కలిసినా వారితో విలువలు, నైతికత గురించే మాట్లాడుతారని తెలిపారు. ఆయన ఎప్పుడూ పదవులు, డబ్బుల కోసం కాంక్షించలేదని, ఆయన మాటల్లోనే కాదు, ఆయన జీవితం కూడా చాలా నైతిక విలులతో గడుపుతున్నారని పేర్కొన్నారు. హరీశ్‌రావుతోపాటు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్‌గౌడ్, బీ వెంకట్‌రెడ్డి తదితరులు కూడా చుక్కా రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.