అతి తకువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి, 13 లక్షల మంది విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకొని ఫీజు బకాయిలు వెంటనే విడుదలచేయాలి.
-హరీశ్‌రావు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య, మోసపూరిత వైఖరి అనుసరిస్తున్నదని, దీంతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలచేయాలని కాలేజీ యాజమాన్యాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. రేవంత్‌రెడ్డి సరారు బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రూపొందించిన ‘బిగ్‌డిబేట్’ వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆయన తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీతోపాటు డిగ్రీ, పీజీ వంటి విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసే పరిస్థితి వస్తున్నదంటే, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న సీఎం ఏం చేస్తున్నట్టు? అని ప్రశ్నించారు. బకాయిలు విడుదల చేయకపోవడంతో సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేయనున్నట్టు యాజమాన్యాలు ప్రకటించినా ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడంలేదని నిలదీశారు. ‘అల్లరి చేయొద్దు’ అని ఆర్థిక శాఖ మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాల, విద్యార్థుల గోడు తీరదు కదా అని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు, విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రికి కమీషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయి, రూ.లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు.
ఒకవైపు కాళేశ్వరం కూలిందంటూనే మరోవైపు, మల్లన్నసాగర్ నుంచి మూసీలో గోదావరి నీళ్లు నింపేందుకు రూ.7,000 కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. డబ్బులు లేవంటూనే జీహెచ్ఎంసీలో హైలెవెల్ బ్రిడ్జీలు, ఫ్లైఓవర్ల్ల నిర్మాణానికి రూ.7,000 కోట్లు, ఫ్యూచర్‌సిటీలో ఆరు లైన్ల రోడ్డు కోసం రూ.5,000 కోట్లు, హెచ్ఎండీఏలో రూ.10,000 కోట్లు, ఆర్ అండ్ బీలో రూ.16 వేల కోట్లు, గురుకులాలను గాలికి వదిలి, రూ.25,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సూళ్లకు టెండర్లు ఎలా పిలుస్తున్నారని నిలదీశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.4,400 కోట్ల టెండర్లు, మూసీ సుందరీకరణకు రూ.1.5 లక్షల కోట్ల టెండర్లు.. ఈ విధంగా కమీషన్లు దండుకునేందుకు రూ.2.5 లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ లేదా? విద్యాసంస్థలు ఎదురొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఫీజు బకాయిల విషయంపై అసెంబ్లీలో తాను ప్రభుత్వాన్ని నిలదీస్తే.. విడతల వారీగా వాటిని విడుదల చేస్తామని, ఏ ఏడాదికి, ఆ ఏడాది క్లియర్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, సిగ్గు లేకుండా ఇప్పుడు మాట తప్పిందని హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దనోట్ల రద్దు, కరోనా వంటి ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ ఆపలేదని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రూ.20 వేల కోట్లు ఫీజు బకాయిల కింద చెల్లించినట్టు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో ఫీజు బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలు నడిపించలేని దుస్థితి వచ్చిందని, ఇప్పటికే రాష్ట్రంలో సగానికిపైగా జూనియర్, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కరెంట్, వాటర్ కనెక్షన్లను కట్ చేస్తున్నారని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు ఇబ్బందిపడుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మరోవైపు బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాని విధానాల వల్ల రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలుతుంటే, సీఎం రేవంత్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు పెరిగారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడారని దుయ్యబట్టారు. యూడైస్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 47 వేల మంది విద్యార్థులు తగ్గినట్టు తెలిపారు. కేసీఆర్‌పై కక్షతో గురుకులాలను, ఫీజు బకాయిలు చెల్లించకుండా ఉన్నత విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమీషన్లు పొందడంపై ఉన్న శ్రద్ధ.. బకాయిలు చెల్లించడంపై లేదని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వానికి కమీషన్లు దండుకోవడంపై ఉన్న ధ్యాస, విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై లేదని, విద్యా కమిషన్ చేష్టలుడిగి చూస్తుండటం దారుణమని పేర్కొన్నారు.