Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ‘జలయజ్ఞంలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెట్టి, ప్రాజెక్టుల అంచనా విలువలను ఇష్టారీతిగా పెంచి ఏజెన్సీలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చే విధానాన్ని తెచ్చి, నిబంధనలకు విరుద్ధంగా సర్వే, డిజైన్ అడ్వాన్స్‌లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుకొని రాష్ర్టాన్ని డెకాయిటీ చేసింది ఎవరు ? వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్నది మీరు కాదా?’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు.
మొదట జీవో 124 (2007, మే 16) ద్వారా రూ.17,875 కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసి 19 నెలల్లోనే పనులు మొదలు పెట్టకుండానే జీవో 238 ( 2008, డిసెంబర్ 12) ద్వారా రూ.38,500 కోట్లకు పరిపాలనా అనుమతులను సవరించింది ఉత్తమ్‌కుమార్ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని హరీశ్ ప్రశ్నించారు. ‘డెకాయిటీ కాంగ్రెస్ ఆనవాళ్లు ఇవిగో’ అంటూ మంత్రి ఉత్తమ్ తీరుపై నిప్పులు చెరిగారు.
‘తుమ్మిడిహట్టి బరాజ్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టు పనులను 7 లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి, టెండర్లు ఖరారు చేసి తలను వదిలేసి తోక దాకా ఏకకాలంలో పనులు ప్రారంభించి అడ్వాన్స్‌లు దండుకున్నది మీరు కాదా?’ అని ప్రశ్నించారు. 2010లో కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను రూ.40,300 కోట్లకు సవరించి పంపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని, అందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి భాగం లేదా? అని ఉదహరించారు. 2008-09 నుంచి 2012 దాకా పెట్టిన ఖర్చు వివరాలను హరీశ్ వెల్లడించారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం డెకాయిటీ ఇదీ అని వివరించారు.
తట్టెడు మట్టి తీయకుండానే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లకు పెంచుకున్నది ఉత్తమ్‌కుమార్ మంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?
– హరీశ్
తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టిన చరిత్ర కేసీఆర్‌ది
రాష్ట్రం ఏర్పడిన 9 ఏండ్లలో వ్యవసాయ రంగం, మానవాభివృద్ధి సూచీల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. 2014-15 నుంచి 2023-24 మధ్య కాలంలో ఆహార పంటల ఉత్పత్తి వృద్ధిరేటు పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న అంశం ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియదా? అని ప్రశ్నించారు.
16.42 శాతం వృద్ధిరేటును సాధించి, పంజాబ్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ర్టాలను వెనకినెట్టి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఉదహరించారు. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర సాధించిన వృద్ధిరేటు కూడా 7.11 శాతమేనని, అవి తెలంగాణ దరిదాపుల్లో కూడా లేవని పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రకారం తెలంగాణలో 2014-15లో పంటల సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు ఉంటే 2022-23 నాటికి అది 2.21 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ఆహార పంటల ఉత్పత్తి, పంటల విస్తీర్ణంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆర్, ఆయన ప్రవేశపెట్టిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు కావా? అని ప్రశ్నించారు.
తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే ప్రాజెక్టును ప్యాకేజీలుగా విభజించి టెండర్లు వేసి.. తలను వదిలేసి తోకదాకా ఏకకాలంలో పనులు ప్రారంభించి అడ్వాన్స్‌లు దండుకున్నది మీరు కాదా? అందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి భాగం లేదా?
– హరీశ్
మీది పెండింగ్ ప్రాజెక్టుల చరిత్ర
కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం కండ్ల ముందు సాక్షాతరించిందని హరీశ్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణ వ్యవసాయానికి కాళేశ్వరం ఊపిరిలూదిందని, దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణను ఆగ్రభాగాన నిలిపిందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు వదిలిపెట్టిపోయిన అనేక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసి వాటిని రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, సాగునీటి సౌకర్యాల కల్పనలో అద్భుతమైన ప్రగతి సాధించినందునే రాష్ట్రంలో వృద్ధిరేటు సాధ్యమైందని చెప్పారు.
కాళేశ్వరంతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, తుమ్మిళ్ల, భక్తరామదాసు, చౌటుపల్లి, హనుమంత్‌రెడ్డి ఎత్తిపోతల, గూడెం తదితర ఎత్తిపోతల పథకాలు, సింగూరు, కిన్నెరసాని కాలువలు, కుమ్రంభీం, నీల్వాయి, గొల్లవాగు, మత్తడివాగు, ర్యాలీవాగు, గడ్డెన్నసుద్దవాగు, పాలెంవాగు, బేతుపల్లి వరద కాలువ, గట్టు పొడిచిన వాగు, తదితర ప్రాజెక్టులను పూర్తి చేసి, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, ఘన్పూర్ ఆనకట్ట కాలువలు, స్వర్ణ, సాత్నాల, చెలిమెలవాగు, నల్లవాగు, సదర్మాట్ ఆనకట్ట కాలువల ఆధునికీకరణ, 28 వేల చెరువుల పునరుద్ధరణ, నదులు, వాగులపై చెక్ డ్యాంల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం ఇట్లా బహుళ అంచెల వ్యూహాన్ని అమలు చేయటం వల్ల రాష్ట్రంలో రెండు పంటలకు సాగునీటి సరఫరా అనూహ్యంగా పెరిగిందని వివరించారు.
శ్రీరాంసాగర్ రెండో దశ కాలువల వ్యవస్థను పూర్తి చేసి కాళేశ్వరం ద్వారా 4 లక్షల ఎకరాలకు మొదటిసారి నీరందించింది కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేసినందువల్ల 30 లక్షల బోర్ల కింద సుమారు 45 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని వివరించారు.
వ్యవసాయ రంగంలో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ను డెకాయిట్ అని అనడానికి మీకు నోరెలా వచ్చింది?
– హరీశ్
సమ్మక్క బరాజ్ లేకుంటే ఎత్తిపోసేవారా?
‘వ్యవసాయ రంగంలో రాష్ర్టాన్ని దేశంలోనే మొదటిస్థానంలో నిలబెట్టిన కేసీఆర్‌ను డెకాయిట్ అని అనడానికి మీకు నోరెలా వచ్చింది’ అంటూ ఉత్తమ్‌కుమార్ తీరుపై హరీశ్ ధ్వజమెత్తారు. దేవాదుల ప్రాజెక్టులో 300 రోజులు 60 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని గొప్పలు చెప్పుకునే ముందు సమ్మకసాగర్ బరాజ్ కట్టకపోయి ఉంటే ఆ పని చేయగలిగేవారా? ఆలోచించాలని ? సూచించారు.
అసలు నీటి నిల్వ అనేదే లేకుండా దేవాదుల ప్రాజెక్టును చంద్రబాబు రూపకల్పన చేస్తే, కంతనపల్లి పేరు మీద ప్రాజెక్టును ఆదివాసీ గ్రామాల ముంపు, పునరావాసం, పర్యావరణ సమస్యల్లో కూరుకుపోయేలా చేసి కట్టకుండా వదిలేసింది కాంగ్రెస్ కాదా? అని భగ్గుమన్నారు. దేవాదుల కింద ఆయకట్టును, దాని పరిధిలో ఉన్న వేలాది చెరువులను నింపేందుకు బరాజ్ అవసరాన్ని గుర్తించి ముంపు, పునరావాసం, పర్యావరణ సమస్యలు తొలగించి సమ్మక బరాజ్‌ను మూడేండ్లలో నిర్మించింది కేసీఆర్ ప్రభుత్వమని, ఆ బరాజ్ నిర్మించిన తర్వాతే దేవాదుల కింద పంపింగ్ ఎకువ రోజులు చేసే వెసులుబాటు కలిగిందని కుండబద్దలు కొట్టారు.
తెలంగాణ ఏర్పడిన 9 ఏండ్లలో వ్యవసాయ రంగ అభివృద్ధి, మానవాభివృద్ధి సూచీల్లో దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌ది. 2014-15 నుంచి 2023-24 మధ్య ఆహార పంటల వృద్ధిరేటు పెరుగుదలపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న అంశం ఉత్తమ్‌కుమార్‌కు తెలియదా?
– హరీశ్
కట్టింది మేము.. ఖాతాలో వేసుకున్నది మీరు..
కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను తమ విజయాలని చెప్పుకోవటం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. సీతారామ ప్రాజెక్టులో మూడు పంప్‌హౌస్‌లు పూర్తిచేసి రెడీగా పెడితే బటన్ నొక్కి ప్రాజెక్టు తమ ఘనత అని చెప్పుకోవడం చూసి ఖమ్మం జిల్లా ప్రజలు నవ్వుకున్నారని, ఆ వంతు ఇప్పుడు వరంగల్ ప్రజలకు వచ్చిందని చెప్పారు. కమీషన్ల కోసం జలయజ్ఞాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమని, కాంగ్రెస్ వదిలిపెట్టిన ప్రాజెక్టులను
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేడంలో భాగంగా పూర్తిచేసింది కేసీఆర్ సర్కారేనన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని హరీశ్ స్పష్టంచేశారు.
దేవాదుల ప్రాజెక్టులో 300 రోజులు 60 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని మీరు గొప్పలు చెప్పుకొంటున్నరు..కేసీఆర్ ప్రభు త్వం సమ్మకసాగర్ బరాజ్ కట్టకపోయి ఉం టే మీరు ఆ పని చేయగలిగేవారా?
– హరీశ్
గృహజ్యోతిని అటకెక్కించిన సర్కార్
గృహజ్యోతి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని హరీశ్‌రావు విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్టు డబ్బా కొట్టుకుంటున్నదని, గృహజ్యోతి అంతా ఉత్తదేనని క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు చెప్తున్నాయని ఉదహరించారు. జీరో బిల్లులు జనరేట్ కాలేదనే నెపంతో పేదల నుంచి పెండింగ్ బిల్లులు వసూలు చేయడం దుర్మార్గమని, ఎన్నికల ముందు ఓమాట, అధికారంలోకొచ్చాక మరోమాటగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని శనివారం ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ఆరు గ్యారెంటీలు, 13 హామీల్లో ఒక పథకాన్నయినా ఈ ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిందా? అని ప్రశ్నించారు.