సభలో అందరికీ సమాన హకులు కల్పించాల్సిన స్పీకర్.. పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. స్పీకర్ తీరుకు, ప్రభుత్వ అహంకారపూరిత వైఖరికి నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిషరిస్తున్నాం
-హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ‘శాసనసభను స్పీకర్ కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారు.. ఫలితంగా ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా శాసనసభ నడుస్తున్నది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులపై సభాముఖంగా సీఎం రేవంత్‌రెడ్డి విషంకక్కినా స్పందించని స్పీకర్.. తాము మాట్లాడటానికి మైక్ ఇవ్వలేదని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన, నదీజలాలు, సీఎం విమర్శల వంటి అంశాలపై మాట్లాడేందుకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మైక్ ఇవ్వరా? అని ప్రశ్నించారు. శాసనసభను స్పీకర్ ఏకపక్షంగా నడుపుతున్న తీరుకు, సీఎం రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక, అసభ్య ప్రవర్తనకు నిరసనగా ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిషరిస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్ సభ్యులు పాదయాత్రగా గన్‌పార్క్‌కు చేరుకొని అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మూసీ కంపు కంటే సీఎం మాటల కంపు ఎకువైందని విమర్శించారు. మూసీ ప్రక్షాళన కంటే ముందు సీఎం నోరు ప్రక్షాళన చేయాలని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ దేశమంతా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటే.. ఇకడ రేవంత్‌రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఇదేనా కాంగ్రెస్ తీరు? అని ప్రశ్నించారు. శాసనసభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నదని విమర్శించారు. బీఏసీ సమావేశానికి తమను గంటన్నర సేపు వెయిట్ చేయించి అవమానించారని మండిపడ్డారు. బీఏసీ సమావేశంలో సభను ఏడు రోజులపాటు నడపాలని, ఆ తర్వాత మళ్లీ సమావేశమై తదుపరి షెడ్యూల్ నిర్ణయిద్దామని స్పష్టంగా అనుకున్నామని గుర్తుచేశారు. కానీ, సభలో ప్రవేశపెట్టిన మినిట్స్‌లో మాత్రం సభ ఎన్నిరోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తున్నామని తప్పుడు సమాచారం పొందుపరిచారని విమర్శించారు.
కస్టోడియన్‌లా లేని స్పీకర్
స్పీకర్ సభను కస్టోడియన్‌లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. సభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత.. కానీ, క్వశ్చన్ అవర్‌లో 10 ప్రశ్నలు ఉంటే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని తమ సభ్యుల మైక్ కట్ చేశారని మండిపడ్డారు. అసెంబ్లీని సీఎల్పీ, గాంధీభవన్ సమావేశాలుగా మార్చేశారని మండిపడ్డారు. సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బయట మాట్లాడినట్టే సొల్లు వాగుడు వాగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు, పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్‌ను పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్‌పై సీఎం వాడిన భాషను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
పార్లమెంట్లో ప్రధాని మోదీని రాహుల్‌గాంధీ విమర్శించలేదా? మరి ఇకడ మేము సీఎంను ప్రశ్నిస్తే మైక్ ఎందుకు ఆపేస్తున్నారు? సీఎంను విమర్శించవద్దని స్పీకర్ మాకు రూల్స్ చెప్పడం ఎకడి పద్ధతి. ప్రతిపక్షం మాట్లాడొద్దంటే అసలు సభ ఎందుకు? మమ్మల్ని ఎందుకు పిలిచినట్టు? సభలో సీఎం బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిలా కాకుండా వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నారు. – హరీశ్‌రావు