హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్‌కు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. విదేశీ పర్యటన సందర్భంగా తాను ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును కలిసినట్టు వెంకట్‌రెడ్డి చేసిన ఆరోపణపై తీవ్రంగా స్పందించారు.
తాను అమెరికాలో ప్రభాకర్‌రావుని కలిసినట్టు రుజువు చేస్తే అమరవీరుల స్థూపం ముందు ముకు నేలకు రాయడానికి తాను సిద్ధమని, రుజువు చేయకపోతే వెంకట్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అదే స్థూపం ముందు ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం హరీశ్‌రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చెప్పడానికి ఈ ఆరోపణ ఒక ఉదాహరణ అన్నారు. తాను కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లింది వాస్తవమని, అయితే తాము ప్రభాకర్‌రావును కలిసినట్టు మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడారని, ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టంచేశారు. తాను ఏ దేశం వెళ్లింది, ఏ హోటల్లో ఉన్నది.. తదితర వివరాలు ఇస్తానని, తన పాస్పోర్ట్తోసహా ఇతర వివరాలు తీసుకొని బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
పబ్లిసిటీ కోసం చౌకబారు ఆరోపణలు
పాస్‌పోర్టులో ఇమిగ్రేషన్ ఇన్ అండ్ ఔట్ వివరాలు ఉంటాయని, కనీస జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడటం చౌకబారుతనమని హరీశ్‌రావు విమర్శించారు. కోమటిరెడ్డి కూడా తన దగ్గర ఉన్న ఆధారాలతో వచ్చి రుజువు చేయాలని, ఆధారాలతో రాని పక్షాన బేషరతుగా క్షమాపణ చెప్పి అమరవీరుల స్థూపం వద్ద ముకు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి ఎప్పుడు రమ్మంటే అప్పుడు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు.
టీవీల్లో బ్రేకింగ్‌లు, స్రోలింగ్ల కోసం చిల్లర వ్యాఖ్యలు చేయడం మాని పాలనపై దృష్టి సారించాలని హితవుపలికారు. నిరాధార నిందలు వేసి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనుకొనే చిల్లర ప్రయత్నాలను కోమటిరెడ్డి మానుకొని హుందాతనాన్ని నిలుపుకోవాలని సూచించారు. ఆ భగవంతుడు మంత్రి వెంకట్‌రెడ్డికి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు.