హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ఏడాది పాలనలో కాంగ్రెస్ సర్కారు అన్ని అంశాల్లోనూ ఫెయిలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. 2024లో ప్రభుత్వ పరంగా ఎందులో చూసినా విజయాల కన్నా.. వైఫల్యాలే ఎకువ ఉన్నాయని దుయ్యబట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారెంటీలు 390 రోజులు గడిచినా మొదలు పెట్టలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లో స్థిరపడ్డ తెలంగాణ బిడ్డలకు మంగళవారం ఓ ప్రకటనలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు, కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ‘ఎన్నికలప్పుడు బోనస్ మాటలు.. ఇప్పుడేమో బోగస్ మాటలు. నాడు అన్ని పంటలకు బోనస్ అన్నరు.. ఇప్పుడు ఒక్క పంటకే అంటున్నరు. ప్రభుత్వం ఇచ్చిన చెకులు కూడా బౌన్స్ అవుతున్నయి. రుణమాఫీ చివర విడత చెకు అని హంగామా చేశారు. ఇంకా డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కానేలేదు. వరంగల్‌లో మహిళా సంఘాలకు ఇచ్చిన చెకుల డబ్బులు కూడా వారికి చేరలేదు. విద్యార్థులకు డైట్ చార్జీల పెంపు కూడా అమలు కాలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కమీషన్ల ధ్యాసే తప్ప కమిట్మెంట్లేదు
కాంగ్రెస్ నాయకులకు కమీషన్ల మీద ధ్యా సే తప్ప ప్రభుత్వ నిర్వహణపై ఎలాంటి కమిట్మెంట్ లేదని హరీశ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులపై క్షణాల్లో కేసులు పెడుతున్న పోలీసులు.. కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘కేసీఆర్ గొప్పగా నెలకొల్పిన గురుకులాలను గాలి కి వదిలేశారు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతు న్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. సీఎంకు ఢిల్లీ పర్యటనల ధ్యాసే తప్ప గల్లీల్లో ఉన్న గురుకులాల మీద పట్టింపు లేదు. ఉద్యోగులు, నిరుద్యోగులకిచ్చిన హామీలు ఉత్తవే అయ్యాయి. 2 లక్షల ఉద్యోగాలని 20 వేలు కూడా భర్తీ చేయలేదు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను వక్రమార్గం పట్టిస్తున్నరు. అయితే లాఠీ లేకుంటే లూటీ అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉన్నది. అప్పులపై అబద్ధాలే.. హామీల అమలుపై అబద్ధాలే.. అసెంబ్లీలో కూడా అడ్డూ అదుపు లేకుండా అబద్ధాలు చెప్తున్నరు. అంబేదర్ రాజ్యాంగం పోయి ఎనుముల రాజ్యాంగం వచ్చింది. రేవంత్ బ్రదర్స్ రాజ్యాంగేతర పనులు శృతి మించుతున్నయి. హైడ్రా పేరిట సామాన్యులకు నిద్ర లేకుండా చేశారు. హైదరాబాద్ ఇమేజీని డ్యామేజ్ చేశారు. రైతుబంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రైతు భరోసాలో కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుత్నురు’ అని హరీశ్ నిప్పులు చెరిగారు.
ఏడాది పాలన తర్వాత అనేక సర్వే ఏజెన్సీలు ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నాలు చేసినయ్. ఏ సర్వేలో కూడా రేవంత్‌కు పాస్ మారులు కూడా రాలేదు. ఎవరినడిగినా రేవంత్‌ను తిడుతున్నరనే సమాధానమే వచ్చింది. డిక్లరేషన్లు అమలు చేసే బదులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తే పగబడుతున్నారు. పాలసీ ఏదంటే పోలీసులను పంపుతున్నరు. కిట్ల స్థానంలో కాంగ్రెస్ మారు తిట్లు వచ్చినయ్.
-హరీశ్‌రావు
ప్రజల బతుకులు మారలే..
ప్రజల బతుకులను మార్చుతామని నమించి గద్దెనెకి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని హరీశ్ దుయ్యబట్టారు. పోలీస్ లోగో మారిందని, టీఎస్ నుంచి టీజీగా మారిందని, ఇప్పుడు రాష్ట్ర లోగో కూడా మార్చుతామంటున్నారని విమర్శించారు. ‘తెలంగాణ తల్లి విగ్రహం మారితే రేవంత్ తప్పులు ఒప్పులయితయా? చివరికి ఫిరాయింపులపై కూడా రేవంత్ తన మాటను ఫిరాయించారు. కాంగ్రెస్, బీజేపీల స్నేహం ఏడాదిలో మరింత బలపడింది. కాళేశ్వరం చిన్న రిపేరును కూడా సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేదు. లగచర్లలో సీఎం భూ దందా బయటపడింది. అమాయకులను అన్యాయంగా అరెస్టు చేశారు. అది మెట్రో అయినా, ఫార్మా ప్రాజెక్టు అయినా ప్రభుత్వానికి ఏ విజన్ లేదు. అప్పులు అగాధంగా పెరిగాయి. అభివృద్ధి అథ పాతాళానికి వెళ్లింది. ఏడాదిలోనే ప్రజలు ఏం కోల్పోయారో గ్రహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడం వల్లే ప్రజలకు మేలు జరుగుతున్నది. రాజకీయ కక్షలు మానండి. రాష్ట్రం అభివృద్ధి కక్ష్యలో పరిభ్రమించేలా పాలన సాగించండి’ అని హరీశ్ హితవుపలికారు.
ఆరు నెలలుగా ఆర్పీల అవస్థలు
ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని డబ్బా కొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఉద్యోగులను అవస్థల పాలు చేస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 6 వేల మంది ఆర్పీలకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సిన దుస్థితి వచ్చిందని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆర్పీలు నిరసన చేపడుతున్న ఫొటోలను ఆయన ఎక్స్ ఖాతాలో జతచేసి కాంగ్రెస్ పాలన తీరును ఎండగట్టారు. కొత్త సంవత్సరంలోనైనా ఆర్పీల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రేవంత్ మాటలకు, చేతలకు పొంతన లేదు
సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 31 : సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పే మాటలకు, బయట చేసే పనులకు పొంతన లేదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులతో కలిసి మంగళవారం ఆయన నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. ఇక్కడ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రీన్ చానల్ పెట్టి విద్యార్థులకు మెస్ చార్జీలు చెల్లిస్తున్నామని రేవంత్ చెప్పిన మాటలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. ఆరు నెలలుగా కాస్మెటిక్, మెస్‌చార్జీలు రాకపోవడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు. మెనూలోనూ చెప్పేది ఒకటి, ఇక్కడ పెట్టేది ఒకటి ఉంటున్నదని చెప్పారు. యువత దావత్‌లకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రభుత్వ హాస్టళ్లను దత్తత తీసుకొని విద్యార్థులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేదరికంలో పుట్టి, కిరోసిన్ దీపాల కింద చదువుకున్నారని, మన్మోహన్ సింగ్, అబ్దుల్ కలాం లాంటి వాళ్లను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు కోటి ఆశలు చూపిన కాంగ్రెస్ పార్టీ.. ఏట్లో రాయి కాదు, కనీసం కూట్లో రాయి కూడా తీయలేకపోయింది. అభయ హస్తం కాస్తా ప్రజలను భయపెట్టే.. బాధ పెట్టే హస్తంగా మారింది. గ్యారెంటీలు అమలు చేయాలని ప్రజలు నిలదీస్తుంటే పాలకులు గారడీల విన్యాసం చేస్తున్నరు.
-హరీశ్‌రావు