Harish Rao | హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే జన్వాడలోని కేటీఆర్ బంధువుల ఇంట్లో డ్రగ్స్ దావత్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ఆదివారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. కేటీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతున్నదని విమర్శించారు. కేటీఆర్ బావమరిది ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్న విషయం ముందే తెలుసుకొన్న మంత్రులు.. దీపావళికి ముందే బాంబులు పేల్చుతామని చెప్పి, పక్కా స్కెచ్ ప్రకారమే ఈ దాడులు చేయించారని ఆరోపించారు. వృద్ధులు, చిన్నపిల్లలు, భార్యాభర్తలు పాల్గొన్న ఫ్యామిలీ ఫంక్షన్‌పై దాడి చేసి రేవ్ పార్టీగా చిత్రీకరించారని విమర్శించారు.
ఈ పార్టీకి కేటీఆర్, ఆయన సతీమణి వెళ్లకపోయినా వెళ్లినట్టు చిత్రీకరించడం గర్హనీయమని పేర్కొన్నారు. పోలీసులు, ఎైక్సెజ్ అధికారులు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగవద్దని, వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా వ్యవహరించొద్దని విజ్ఞప్తిచేశారు. ప్రత్యక్షంగా తమ ప్రత్యర్థులను ఎదుర్కొనే దమ్ములేకనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగా తమ ప్రత్యర్థులను ఎదుర్కొలేకపోతే వారు కుటుంబాలను లక్ష్యం చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొలేక నీచ రాజకీయాలకు దిగింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ప్రతీకార రాజకీయ చర్యలు, డైవర్షన్ పాలిటిక్స్‌తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తున్న. ఈ ఘటనతో రాహుల్‌గాంధీని ప్రసన్నం చేసుకోవాలనే తపన కనిపిస్తున్నది. సిగ్గుచేటు. తెలంగాణ కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ చౌకబారు రాజకీయాలు వెల్లడయ్యాయి’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.