Harish Rao | హైదరాబాద్ జూన్ 24 (నమస్తేతెలంగాణ): రైతు నేస్తం సంబురాల పేరిట సచివాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి సంకుచితబుద్ధిని చాటుకున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సహనం కోల్పోయి కేసీఆర్‌పై దూషణలకు దిగడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి రైతుల ఖాతాల్లో రూ.80 వేల కోట్ల రైతుబంధు జమ చేసిన నాయకుడిని ఉరి తీయాలని మాట్లాడటం రేవంత్ కుసంస్కారానికి నిదర్శనమని నిప్పులు చెరిగారు. అధికారిక కార్యక్రమమనే సోయిని కూడా మరిచి కేసీఆర్‌పై సంస్కారహీనంగా మాట్లాడి రేవంత్ మరోసారి చిల్లర బుద్ధిని చాటుకున్నారని మంగళవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు శనిలా..శాపంలా మారిన రేవంత్‌రెడ్డి ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అనే చందంగా నోటికొచ్చిన అబద్ధాలు.
ఇష్టారీతిన ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. పదేండ్ల అద్భుతమైన కేసీఆర్ పాలనను తక్కువ చేసి చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. అడ్డమైన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్.. వాటిని నెరవేర్చడం చేతగాక, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత తట్టుకొలేక నిత్యం బూతులతో నెట్టుకు రావాలని చూస్తున్నాడని, కానీ ఇది కుదరదని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుపై భరోసా లేకనే విధిలేని పరిస్థితుల్లో రైతు భరోసా వేసి తానే చాంపియన్ అనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌ను రైతులు నమ్మే పరిస్థితి లేదని స్పష్టంచేశారు.
సీఎం స్థానంలో ఉండి, సభానాయకుడిగా వ్యవహరిస్త్తూ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం.. నీకు అసెంబ్లీ వ్యవహారాల గురించి తెలియకపోవడం సిగ్గుచేటు. బనచర్ల ప్రాజెక్టుపై వేదిక ఏదైనా చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. చర్చించడమే కాదు.. నీ ద్రోహాన్ని, నువ్వు చేస్తున్న మోసాన్ని బట్టబయలు చేస్తం..
-హరీశ్
తెలంగాణను తెచ్చి.. రైతుబంధు పేరిట రూ.80 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడిని ఉరి తీయాలని మాట్లాడటం రేవంత్ కుసంస్కారానికి నిదర్శనం. అధికారిక కార్యక్రమమనే సోయి మరిచి కేసీఆర్‌పై సంస్కారహీనంగా మాట్లాడి మరోసారి తన చిల్లర బుద్ధిని బయటపెట్టుకున్నరు. తెలంగాణకు శనిలా..శాపంలా మారిన రేవంత్‌రెడ్డి ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్న చందంగా నోటికొచ్చిన అబద్ధాలు.. ఇష్టారీతిన ప్రగల్భాలు పలికిండ్రు.
-హరీశ్
దేశంలోనే తొలిసారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ఆలోచించి రైతుబంధును తెచ్చి రూ.80 వేల కోట్లను అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని హరీశ్ గుర్తుచేశారు. సాగును పండుగలా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ఉన్మాదంతో ఉరి తీయాలని మాట్లాడటం బాధాకరమని వాపోయారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ సమాజం, చరిత్ర క్షమించబోదని హెచ్చరించారు. లక్ష కోట్ల ఖర్చే లేని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ చెప్పడం విని ప్రపంచమే నివ్వెరపోతున్నదని పేర్కొన్నారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎడారిలా మారితే ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఎలా నిలిచిందని ప్రశ్నించారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి 44 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించి నాలుగు వేల కోట్లతో ఆరున్నర ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని తెలిపారు.
‘రేవంత్‌రెడ్డీ.. ఈ విషయం నీకు తెలియకుంటే ఇరిగేషన్ శాఖలోని అధికారులను అడిగి తెలుసుకో’ అని దెప్పిపొడిచారు. సీఎం స్థానంలో ఉండి, సభానాయకుడిగా వ్యవహరిస్తూ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం.. అసెంబ్లీ వ్యవహారాల గురించి ఆయనకు తెలియకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ‘నదిపై ప్రాజెక్టులు నిర్మించనందుకే 299 టీఎంసీలకు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నామని ఎన్నిసార్లు చెప్పినా మీకు ఒంట బట్టకపోవడం..పని గట్టుకొని బురద జల్లడం మానుకోకపోవడం..అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం’ అని ఖండించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించని దద్దమ్మ రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ఇంతటితో ఆగకుండా ఇప్పుడు అన్నారం, సుందిళ్ల కూడా కూలిపోయాయని తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎడారిలా మారితే ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం నంబర్ వన్‌గా ఎట్ల నిలిచింది? నువ్వు వచ్చిన తర్వాత ఒక్క చెక్‌డ్యామ్ కట్టకపోతివి.. ఒక్క కాలువ తవ్వకపోతివి.. మరి 3 కోట్ల టన్నుల ధాన్యం ఎట్ల ఉత్తత్తి జరిగింది రేవంత్‌రెడ్డీ?
-హరీశ్
హైదరాబాద్, జూన్ 24 (నమస్తేతెలంగాణ): స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసమే రైతుభరోసా పేరిట రేవంత్ సర్కారు డ్రామాలు ఆడుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు నాట్లకు నాట్లకు మధ్య రైతుబంధు పడితే నేడు ఓట్లకు ఓట్లకు మధ్య రైతుభరోసా పడుతున్నదని మంగళవారం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ‘రైతులకు ఏం చేశావని సంబురాలు చేసుకుంటున్నవ్ రేవంత్‌రెడ్డీ? రెండు సీజన్ల రైతుభరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు రైతుభరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వనందుకా? అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకే పరిమితం చేసినందుకా?
రూ. 1200 కోట్ల బోనస్ నగదు చెల్లించనందుకా? ప్రీమియం కట్టకుండా రైతుబీమాను ప్రశ్నార్థకం చేసినందుకా? పంటల బీమా హామీని అటకెక్కించినందుకా? అన్నం పెట్టే అన్నదాతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసినందుకా? లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బేడీలు వేయించినందుకా? ఏడాదిన్నర పాలనలో ఒక్క చెరువు నింపకుండా, చెక్ డ్యాం కట్టకుండా ఎకరాకు కూడా నీళ్లివ్వనందుకా? ధాన్యం కొనుగొళ్లు చేయకుండా అన్నదాతను ఇబ్బందిపెట్టినందుకా? జనుము, జీలుగ విత్తనాల ధరలు పెంచి సకాలంలో అందించనందుకా? వరంగల్ డిక్లరేషన్‌ను పక్కన పెట్టినందుకా? మీ దుర్మార్గపు పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నందుకా?’ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముందుచూపుతో అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నిరంతర కరెంట్, పంటల కొనుగోలుతో నాడు రైతాంగం సుభిక్షంగా ఉండేదని హరీశ్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అవగాహనలేమి, బాధ్యతారాహిత్యంతో తీసుకున్న చర్యల ఫలితంగా సాగు సంక్షోభంలో చిక్కుకున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో తెచ్చిన పథకాలు అందకపోవడంతో పంట పొలాలు, వడ్ల కుప్పలపైనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ది రైతు సంక్షేమ ప్రభుత్వమైతే, కాంగ్రెస్‌ది రైతు సంక్షోభ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ‘స్థానిక ఎన్నికల ముందు మీరు చేస్తున్న ఓట్ల జిమ్మిక్కులను రైతులేవరూ నమ్మబోరు.. ఇప్పటికైనా మాటలు కట్టిపెట్టి ఎన్నికల హామీలపై దృష్టిపెట్టండి’ అని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డీ..నీది నోరా..మోరా? మహిళలకు వడ్డీ లేని రుణాలపై అబద్ధాలు.. ఉద్యోగ నియామకాలపై అబద్ధాలు.. అన్నీ తప్పుడు మాటలు మాట్లాడుతున్న నిన్ను వదిలిపెట్టేదిలేదు. హామీలు అమలు చేసేదాకా నీ వెంట పడుతూనే ఉంటం.
-హరీశ్