హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : ‘పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టు.. ప్రజాస్వామ్యానికి వెన్నెముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం తగదని మాజీ మంత్రి హరీశ్‌రావు హితవుపలికారు. ‘మీరు నగదు బ్యాగులతో దొరికారని, అందరూ మీ లానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని, సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బతుకుతున్నారని అనుకోవడం తప్పు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు. సివిల్ సర్వెంట్స్ మోటో ‘ఎక్స్‌లెన్స్ ఇన్ యాక్షన్’. ‘ఏసీ ఇన్ యాక్షన్’ కాదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల గురించి తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవమానించేవిగా, అగౌరవపరిచేవిగా ఉన్నాయి. బ్యూరోక్రాట్ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న’ అని మంగళవారం ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు.
కేసీఆర్ చరిత్ర సృష్టించి సరిగ్గా 11 ఏండ్లు
తెలంగాణ రాష్ట్ర సాధన మహోద్యమంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చరిత్ర సృష్టించి సరిగ్గా 11 సంవత్సరాలు పూర్తయ్యాయని హరీశ్ గుర్తుచేశారు. ‘విజనరీ లీడర్ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక ఘట్టం 2014 ఫిబ్రవరి 18న సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. నాటి ప్రజా ఉద్యమం విజయవంతమైంది’ అని పేర్కొన్నారు. కేసీఆర్‌తోపాటు తాను రెండు చేతులతో విజయసంకేతం చూపుతున్న చిత్రాన్ని లఎక్స్లో పోస్టు చేశారు.