హైదరాబాద్, మార్చి 20 (నమస్తేతెలంగాణ): అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘బడా ఝూటా’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ‘అంకెల గారడీ చేసి ఆరు గ్యారెంటీలకు ఘోరీ కట్టారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు మొండిచెయ్యి చూపారు. పెట్టుబడుల పేరిట కట్టుకథలు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టి అన్ని వర్గాలను నిరాశపరిచారు’ అంటూ ధ్వజమెత్తారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద్‌గౌడ్, మాణిక్‌రావు, సంజయ్ కల్వకుంట్ల, కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింతా ప్రభాకర్‌తో కలిసి హరీశ్ విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ డిక్లరేషన్లు తప్ప అభివృద్ధి కోసం కాదనే విషయం మూడో బడ్జెట్ కేటాయింపులతో తేటతెల్లమైందని స్పష్టంచేశారు.
ఇందిర, రాజీవ్ ఆత్మలు క్షోభిస్తున్నయ్
రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేర్లు పెట్టిన పథకాలకు కేటాయింపులు తప్ప అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని హరీశ్ విమర్శించారు. గత బడ్జెట్లో రెండు పథకాలకు రూ.6 వేల కోట్ల చొప్పున కేటాయించి ఖర్చు చేసింది మాత్రం సున్నా అని దుయ్యబట్టారు. రేవంత్ సర్కార్ తీరుతో ఇందిర, రాజీవ్‌గాంధీ ఆత్మలు క్షోభిస్తున్నాయని వాపోయారు. ‘పింఛన్లు పెంచకుండా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు.. బెనిఫిట్స్ ఇవ్వకుండా రిటైర్డ్ ఉద్యోగులకు.. పీఆర్సీ అమలు చేయకుండా ఉద్యోగులకు, విలీనం చేయకుండా ఆర్టీసీ కార్మికులకు, రూ. 2,500 ఇవ్వకుండా మహిళలకు, బీసీఏలో చేర్చుతామని ముదిరాజ్‌లకు, ప్రమాద బీమా ఇవ్వకుండా గౌడన్నలకు, గొర్లు పంపిణీ చేయకుండా గొల్లకుర్మలకు, వేతనాలు పెంచకుండా ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు మొండిచెయ్యి చూపారు’ అని తూర్పారబట్టారు.
అప్పులు తెచ్చారు.. అభివృద్ధి మరిచారు
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో మూడున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఉద్ధరించిందేమీలేదని హరీశ్ ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ పదేండ్లలో 2.87 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కాళేశ్వరం, సెక్రటేరియట్ కట్టిండ్రు. మిషన్ భగీరథతో నల్లా నీళ్లిచ్చిండ్రు. మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేసిండ్రు అని గుర్తుచేశారు. రేవంత్ సర్కార్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఎకరాకు నీరందించలేదని నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్ సర్కార్ నగరాన్ని మూడు ముక్కలు చేసేందుకు తెచ్చిన క్యూర్, ప్యూర్, రేర్ పక్కా చోర్ మాడల్’ అని తేల్చిచెప్పారు. మేడారం జాతరను ఘనంగా నిర్వహించామని భట్టి బడ్జెట్ ప్రసంగంలో చంకలు గుద్దుకున్నారని, కానీ మేడారం జాతర టెండర్లలో జరిగిన గోల్మాల్ ఏమిటో క్యాబినెట్ మంత్రి కుమార్తెనే బయటపెట్టిందని గుర్తుచేశారు. గురుకులాలను ఉద్ధరించలేని సర్కార్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని తూర్పారబట్టారు. చేతగాని పాలనతో 167 మంది గురుకుల పిల్లలను పొట్టనబెట్టుకున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
రేవంత్ ప్రభుత్వం పెట్టుబడులపై కట్టుకథలు చెప్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నదని హరీశ్ మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం, శ్రీధర్‌బాబు విదేశీ పర్యటనకు వెళ్లి, గ్లోబల్ సమ్మిట్‌లో సాధించిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ విదేశాలకు వెళ్లింది అక్రమ సొమ్ము భద్రపరుచుకోవడానికే అని చెప్పారు. రేవంత్ పాలనలో రాష్ట్ర జీఎస్డీపీ, తలసరి ఆదాయం తగ్గిపోయిందని వివరించారు. రేవంత్ విధానాలు, హైడ్రా కూల్చివేతలతోనే జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో తగ్గుదల నమోదైందని విశ్లేషించారు. బీఆర్ఎస్ హయాంలో రూపుదిద్దుకున్న ఇండస్ట్రియల్ హబ్‌ను కాంగ్రెస్ కరప్షన్ హబ్‌గా మార్చిందన్నారు.
ఉద్యోగాలపై తప్పుడు లెక్కలు
సీఎం ఏనాడూ హాజరుకాని ప్రజావాణిపై భట్టి బడ్జెట్ ప్రసంగంలో గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని హరీశ్ విమర్శించారు. ‘కేసీఆర్ పాలనలో 1.67 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేశారు. లక్షలాది మందికి ్రప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించారు..కానీ రేవంత్‌రెడ్డి మాత్రం రెండున్నరేండ్లలో 67 వేల ఉద్యోగాలిచ్చామని తప్పుడు లెక్కలు చెప్తున్నారు.. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టిన జాబ్‌లను సైతం సిగ్గులేకుండా తన ఖాతాలో వేసుకుంటున్నారు’ అని విరుచుకుపడ్డారు.
రేవంత్ ముక్కు నేలకు రాయాలి
మూడుసార్లు రైతుబంధు, సన్నవడ్లకు బోనస్, సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టిన సీఎం నిస్సిగ్గుగా రైతుపక్షపాతినని చెప్పుకొంటున్నారని దుయ్యబట్టారు. ‘రేవంత్‌రెడ్డీ.. ఏడాదిలో రెండు పంటలకు బోనస్ ఇచ్చారని నిరూపిస్తే రాజీనామాకు రెడీగా ఉన్నా’అంటూ సవాల్ విసిరారు. అన్నదాతలను మోసం చేసిన సీఎం ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ ఘనత కేసీఆర్‌దే
తెలంగాణకు వెలుగులు పంచుతున్న యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని, బడ్జెట్ సాక్షిగా ఆ ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణమని ఒప్పుకోవడాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో చీకట్లో మగ్గిన తెలంగాణలో కొత్త వెలుగులు నింపిన ఘనత బీఆర్ఎస్ పాలనకే దక్కిందని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ టెండర్లలో భారీ కుంభకోణం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరుగుతున్నది. నిబంధనల పరిమితి 5 శాతం దాటకుండా పక్కా స్కెచ్‌తో కనిష్ఠంగా 4.59 శాతం నుంచి 4.96 శాతం ఎక్సెస్‌తో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నరు’ అని హరీశ్‌రావు సంచలన విమర్శలు చేశారు. ఒక్కో స్కూల్‌కు రూ. 250 కోట్లు కేటాయించగా, సివిల్ పనుల కోసమే రూ.150 కోట్లు ఖర్చు చేయడంలోని మతలబేంటని ప్రశించారు. 76 స్కూళ్లకు అంచనా వ్యయం రూ.10,199.54 కోట్లు కాగా, కాంట్రాక్టర్లు రూ.10,693.55 కోట్ల ఎక్సెస్‌తో దక్కించుకున్నారని, అంటే ఈ టెండర్ల ద్వారా రూ. 494 కోట్లు దోచిపెడుతున్నారని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల స్కామ్‌ను ఆధారాలతో సహా బట్టబయలు చేస్తానని తేల్చిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 76 సమీకృత పాఠశాలలకు టెండర్లు పూర్తిచేశారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంజూరు చేసి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కటి కూడా ఇవ్వకుండా వివక్ష చూపారని దుయ్యబట్టారు. ‘సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొన్నం, తుమ్మల, సీతక్క నియోజవర్గాల్లో 4.95 శాతం, మంత్రులు సురేఖ, రాజనర్సింహ నియోజవర్గాల్లో 4.99 శాతం, మంత్రి కోమటిరెడ్డి నియోజకవర్గంలో 4.87 శాతం, జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం లో 4.77 శాతం, స్పీకర్ ప్రసాద్, మంత్రి శ్రీధర్ నియోజకవర్గాల్లో 4.89 ఎక్సెస్ ధరలకు టెండర్లు కేటాయించడం అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు.
ఉన్న గురుకులాలను ఉద్ధరించలేని కాంగ్రెస్ సర్కార్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల పేరిట గొప్పలు చెప్పుకోకవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ చేతగాని పాలనతో 167 మంది గురుకుల పిల్లలను పొట్టనబెట్టుకున్నది. రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పేర్లు పెట్టిన పథకాలకు గత బడ్జెట్లోనూ రూ.6 వేల కోట్ల చొప్పున కేటాయించి రూపాయి ఇవ్వలే. రేవంత్ సర్కార్ తీరుతో ఇందిర, రాజీవ్‌గాంధీ ఆత్మలు క్షోభిస్తున్నయి. -హరీశ్‌రావు