హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైరయ్యారు. నిరసన తెలిపే హకును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషమని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. నిరసన హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హకు అనే సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిందని ఆయన దుయ్యబట్టారు. విద్యార్థులను అణచివేయడం మాని.. వారి సమస్యలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. తక్షణం ఆంక్షల ఉత్తర్వులను రద్దు చేసి.. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ తుంగలో తొకాలనే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తంచేశారు. విద్యార్థులు, యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడాన్ని బీఆర్ఎస్ ఎప్పటికీ సహించబోదని ఆయన హెచ్చరించారు.
భావవ్యక్తీకరణపై కాంగ్రెస్‌ది ద్వంద్వ వైఖరి : హరీశ్‌రావు
పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ భావప్రకటనా స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్తుండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా జర్నలిస్టులను అరెస్టు చేసిందని సోమవారం ఒకప్రకటనలో మండిపడ్డారు. వరంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అమానుష వ్యాఖ్యలు.. ప్రజాస్వామ్యం, భావప్రకటనా స్వేచ్ఛ పట్ల ఆయనకు సదాభిప్రాయం లేనట్టుగా ఉన్నదని ఆక్షేపించారు. నైతికత, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్ నేతలకు అంకితభావం లేదని చెప్పడానికి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటని హరీశ్‌రావు అన్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హరీశ్‌రావు అన్నారు.
నిషేధ ఉత్తర్వులను వెనక్కి తీసుకోండి : ఏబీవీపీ
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమాలపై జారీచేసిన నిషేధ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీవన్ ఒక ప్రకటనలో వర్సిటీ అధికారులను డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలు, ఆందోళనలను నిషేధించడమంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను నులిమేయడం అత్యంత దౌర్భాగ్యమని ఆరోపించారు. నిరంకుశ పోకడలను మానుకొని, జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.