నారాయణరావుపేట, ఏప్రిల్ 29 : నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి పట్టి లేదు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి అసలు అవగాహన లేదని మండిపడ్డారు. ఏ జిల్లాలో ఏ ఒక మంత్రీ కొనుగోలు కేంద్రాలు, రైతుల కల్లాల వైపు చూడటం లేదని ధ్వజమెత్తారు.
‘కరెంటు సరిగా రాదు, పంటల బీమా లేదు, వడ్లు కొనే దికు లేదు.. బోనస్ లేదు.. రేవంత్‌రెడ్డి రైతు బిడ్డనంటూ ప్రజల్ని మోసం చేశాడు. నువ్వు రైతు బిడ్డవి కాదు.. రైతు ద్రోహివి. వాళ్ల ఉసురు పోసుకుంటున్నావ’ని నిప్పులు చెరిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలని, అప్పుడే వాళ్లు దారికి వస్తారని రైతులకు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో షరతులు లేకుండా మకజొన్న, జొన్నలు, శనగలు, సన్ ఫ్లవర్ కొనుగోలు చేశామని గుర్తుచేశారు. ఆ తర్వాత సిద్దిపేట కలెక్టర్‌కు ఫోన్ చేసి జీపీఎస్, ఆన్లైన్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. ఈ మేరకు పాత పద్ధతిలో మాన్యువల్‌గానే కొనుగోలు చేయాలని ఐకేపీ సెంటర్లకు, సీసీలకు కలెక్టర్ ఆదేశాలిచ్చారు.