హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి పాలనలో పోలీసుల ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే రక్షణ కరువైన దికుమాలిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. పోలీసుల జీతాల నుంచి ప్రతినెలా ఆరోగ్య భద్రత కోసం డబ్బులు కట్ చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి సేవలు అందించడంలో మాత్రం వివక్ష చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల భద్రత కోసం కృషి చేసే పోలీసులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని దూరం చేసి, నిమ్స్ దవాఖానకే పరిమితం చేయడం శోచనీయమం అన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో సకాలంలో వైద్యం అందక పోలీసు కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెపోటుకు గురైన ఏఆర్ ఎస్సై జనార్దన్‌రావును ‘గోల్డెన్ అవర్ ’లో ఓ ప్రైవేటు దవాఖానకు తరలించినా పోలీసు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా చికిత్సకు నిరాకరించడంతో ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఎంతోమంది ప్రాణాలు పోతున్నా, ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లి ఇబ్బందులు ఎదురుంటున్నా పాలకులకు మొద్దునిద్ర వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవితాలతో చెలగాటం..
ఆపతాలంలో ఆదుకొనే ఆరోగ్య భద్రత పథకం లక్ష్యాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు నీరుగార్చిందని హరీశ్‌రావు అభివర్ణించారు. ఆంక్షలు, అరెస్టులతో నిత్యం పోలీసుల పహారా నడుమ పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఏక్ పోలీస్ వ్యవస్థ తెస్తామని ఊదరగొట్టిన రేవంత్ అధికారంలోకి రాగానే తుంగలో తొక్కిందని, సమస్యలు పరిషరించాలని రోడ్డెకిన పోలీసులను జైలుకు పంపడమే కాక సస్పెండ్ చేయడం రాష్ట్ర సర్కార్ అహంకారధోరణికి నిదర్శనం అన్నారు. ఒకపక్క వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నా సరే వారికి రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు, టీఏలు, స్టేషన్ అలవెన్సులు ఇవ్వకుండా పోలీసులను ఇబ్బందిపెట్టడమే ఇందిరమ్మ రాజ్యస్థాపనా.. అని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య భద్రత బకాయిలన్నీ చెల్లించాలని, అన్ని కార్పొరేట్ దవాఖానల్లో వైద్య సేవలు పునరుద్ధరించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.