హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘గురుకులాలకు గ్రీన్‌చానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలేనా? కమీషన్లు రావన్న ఉద్దేశంతో గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాటమార్చడం, ఇదే రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న సిద్ధాంతమని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్మాటలకు, చేతలకు పొంతన లేదనడానికి గురుకులకు కేటాయించిన చాలీచాలని నిధులు ఉదాహరణ అని ఎక్స్ వేదికగా విమర్శించారు.
రాష్ట్రంలోని 1,024 గురుకులాలకు కేవలం రూ.60 కోట్లు కేటాయించి, గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రూ.12వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటుచేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్‌రెడ్డికి.. ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చదివే గురుకులాలకు రూ.100 కోట్లు కూడా కేటాయించే మనసు రాలేదా? అని ప్రశ్నించారు. గురుకులాలకు సర్కారు కేటాయించిన నిధులతో సిబ్బంది వేతనాలు, మోటర్ల మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యమవుతాయని నిలదీశారు. గురుకులాల ఖ్యాతిని సీఎం దిగజార్చారని, విషవలయాలుగా మార్చి, అపఖ్యాతిని మూటగట్టుకున్నారని విమర్శించారు.