హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కాయకష్టాన్ని నమ్ముకొని బతుకెళ్లదీస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల కాంగ్రెస్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. వేతనాలు, పెండింగ్ బిల్లులు చెల్లించకుండా నరకం చూపిస్తున్నదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం వరంగల్‌కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికులు హరీశ్‌రావును కలిశారు. తమ గోడును పట్టించుకోవాలని, కాంగ్రెస్ సర్కారును నిలదీయాలని విజ్ఞప్తిచేశారు. ఇందుకు హరీశ్ సానుకూలంగా స్పందించారు. దగాపడ్డ మధ్యాహ్నభోజన కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాలు చేస్తుంటే రేవంత్ సర్కారు మొద్దునిద్ర నటిస్తున్నదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం జీతాలు పెంచుతామని నమ్మించి ఇప్పుడు నయవంచన చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఉన్నపలంగా మధ్యాహ్న భోజన పథకం నుంచి దూరం చేస్తే 20 ఏండ్లుగా పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఎంకావాలి? ఏడాది నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి విద్యార్థులకు అన్నంపెట్టిన చిరుద్యోగుల ఆర్థిక భారం ఎవరు తీర్చాలి?’ అని ప్రశ్నించారు. సర్కారు ఏకపక్ష నిర్ణయంతో వేలాదిమంది కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సర్కారు కండ్లు తెరిచి వారి సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ వారి తరఫున పోరాడుతుందని స్పష్టంచేశారు.