హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కర్షకులకు కాళరాత్రులు తెచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో వరి నాట్లు పడుతున్నప్పటికీ యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికలు లేదని, సీఎం రేవంత్‌రెడ్డి రైతులను పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. యూరియాపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సీఎం మిస్‌వరల్డ్ పోటీలపై దృష్టి పెట్టారని ఆదివారం ఎక్స్ ద్వారా హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ చెప్పినట్టుగానే ఆనాటి రోజులు తిరిగి తీసుకువచ్చారని ఎద్దేవాచేశారు. రైతన్నను నడి రోడ్డుమీదకు ఈడ్చుకొచ్చి పాపం మూట కట్టుకున్నాడని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రాత్రంతా రైతులు పడిగాపులు పడ్డారని తెలిపారు. రేవంత్ సర్కారు స్పందించి, సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.