హైదరాబాద్ జూన్ 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను పక్కనబెట్టి ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపునకు దిగుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి గోదావరిని చెరబడుతుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, ఫార్ములా ఈ- రేస్ కేసు పేరిట మాజీ మంత్రి కేటీఆర్‌ను నోటీసులతో వేధిస్తున్నదని శనివారం ఎక్స్‌వేదికగా నిప్పులు చెరిగారు. ఫార్ములా ఈ కార్ రేస్‌ను తెచ్చి రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపజేసిన కేటీఆర్‌ను బద్నాం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. హస్తం పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరఫున పోరాటాన్ని ఆపబోమని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.
తెలుగుభాషకు మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి ; ఆర్‌యూపీపీ టీజీ డిమాండ్
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : తెలుగుభాషకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీ) తెలంగాణ రాష్ట్రం-1927 కోరింది. భాషా పరిరక్షణకు ప్రత్యేకంగా మంత్రిని నియమించాలని ప్రభుత్వానికి సూచించింది. ఆర్‌యూపీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని శనివారం నాంపల్లిలోని హిందీ ప్రచార సభలో నిర్వహించారు. పదోన్నతులు పొందని భాషాపండితులకు ప్ర మోషన్లు కల్పించాలని, ప్రాథమిక పాఠశాలల్లోనూ తెలుగు, హిందీ తదితర భాషాపండితులను నియమించాలని తీర్మానించారు.