హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : ‘కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నమని పీసీసీ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించిండు.. ఇప్పుడు రాయితో కొట్టాల్సింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలనా? లేక వారిని ప్రోత్సహించినవారినా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ద్వంద్వ విధానాలు, మోసపూరిత వైఖరి గురించి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి రుజువయ్యాయని బుధవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డీ.. మీ సొంత పార్టీ నేతనే, మీరు చేసిన ఎమ్మెల్యేల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, ఇది దుర్మార్గమైన చర్య అని వేలెత్తి చూపారు. ఇప్పటికైనా ఈ విషయంలో లెంపలు వేసుకుంటరా?’ అని నిలదీశారు. జీవన్‌రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా పార్టీ ఫిరాయింపులు అనేవి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని, సీఎం దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు కదా అని ఉదహరించారు. ఇప్పుటికైనా చేసిన తప్పును ఒప్పుకొని, క్షమాపణ చెప్తారా? అని నిలదీశారు. సీఎం గడపగడపకు వెళ్లి చేర్చుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం వేటు వేయాల్సిందేనని హరీశ్ డిమాండ్ చేశారు.