హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : అవినీతి గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతది అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. ‘వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ‘వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’.. నువ్వేమో ‘వాటా మ్యాన్’ అని దెప్పిపొడిచారు. ‘రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెప్తరు.. మున్సిపాలిటీల్లో వాటా లేకుండా అనుమతులు వస్తున్నయా? ల్యాండ్ కన్వర్షన్ అవుతున్నదా? అపార్ట్మెంట్లకు అనుమతులు వస్తున్నయా? ఫైనాన్స్‌లో బిల్లు వస్తున్నదా? ఇవన్నీ ప్రజలకు తెలియదా?’ అని నిలదీశారు.
మేము కడితే.. మీరు అప్పగించిండ్రు
‘కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర సంస్థలకు ఏకంగా ప్రాజెక్టులను అప్పగించేసింది. నాడు కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించాలని చంద్రబాబు పట్టుపడితే.. అప్పగించేది లేదని కేసీఆర్ తెగేసి చెప్పిండ్రు. కృష్ణా నదిలో జలాల పంపిణీ పూర్తయ్యే వరకు తాము ప్రాజెక్టులను అప్పగించం అని చెప్పినం. ఏపీ ప్రభుత్వం నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ‘కేడబ్ల్యూడీటీ-2 కేఆర్ఎంబీకి సంబంధమే లేదు. ఈ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాల్సిందే’నని చంద్రబాబు వాదించిండు. కానీ కేసీఆర్ మాత్రం.. కేడబ్ల్యూడీటీ-2 అవార్డు తేలేవరకు ప్రాజెక్టులను అప్పగించే ప్రశ్నే లేదు’ అని కరాఖండిగా చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ వాదనను సమర్థించింది.
ఈ సమస్యను త్వరగా తేల్చాలని కేఆర్ఎంబీకి లేఖ రాస్తామని, ఆ సమస్య తేలిన తర్వాతే ప్రాజెక్టులు అప్పగించాలని చెప్పింది. ఈ విషయాలన్నీ రేవంత్‌రెడ్డి చదివిన మినిట్స్‌లోనే రికార్డయ్యాయి. పదేండ్ల పాటు ప్రాజెక్టులను అప్పగించకుండా పోరాడినం. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన నెల రోజుల్లోనే మన ప్రాజెక్టులను తీసుకోండ్రి అని అప్పగించింది. ‘ కేసీఆర్ నల్లగొండలో సభపెట్టి బిడ్డా మన ప్రాజెక్టులను ఎట్లా అప్పగిస్తవ్? పదేండ్లు మేం కాపాడినం. నువ్వెట్లా అప్పగిస్తవ్? అని గర్జించిండ్రు. అప్పుడు మేల్కొన్న కాంగ్రెస్.. ‘ఏదో తెల్వక ఇచ్చినం.. మేం ఒప్పుకోలేదు’ అని బుకాయించింది. కేసీఆర్, బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన కాంగ్రెస్ సర్కారు.. అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రాజెక్టులను ఇవ్వబోమని తీర్మానం చేసింది’ అని హరీశ్ గుర్తుచేశారు.
నీళ్లను వాడుకోలేని దద్దమ్మ ప్రభుత్వమిది
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్లలో కృష్ణా జలాలను అతి తక్కువ వాడిన సంవత్సరం గత సంవత్సరమని, కేవలం 28.4 శాతం నీళ్లనే వినియోగించారని హరీశ్ చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఏ సంవత్సరం కూడా ఇంత తక్కువగా నీళ్లు వాడలేదని, నెట్టేంపాడు ప్రాజెక్టు కిం ద క్రాప్ హాలిడే ప్రకటించి.. ఆంధ్రాకు నీళ్లు వదిలేశారని, తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు వచ్చే నీళ్లను వాడుకోలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఇదని మండిపడ్డారు.
మీరు చేసిందేమిటి?
‘అధికారంలోకి వచ్చాక మీరు ఏం చేశారు? కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టు రాకపాయె! ఒ క్క ప్రాజెక్టు పూర్తికాకపాయె! ఉన్న నీళ్లలో గురుదక్షిణ కింద 65 శాతం నీళ్లు ఆంధ్రాకు వదిలేస్తి రి! ఇక ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తిరి! ఇక మీరు చేసిందేమిటి? అంతా కూలగొట్టుడు, తెగ్గొట్టుడు, మునగ్గొట్టుడు, అప్పజెప్పు డు, నీళ్లు కిందికి వదులుడు.. ఇంతే కదా మీరు చేసిన ఉద్దార్కం’ అని నిప్పులు చెరిగారు.
ఉత్తమ్‌కుమార్ అబద్ధాలు
‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌రెడ్డికి శిష్యుడిలా మారిండు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అన్ని శాఖలను సమన్వయం చేయించి, సీతారామ ప్రాజెక్టుకు హైడ్రాలాజికల్ అనుమతులు తీసుకొచ్చినట్టు ఉత్తమ్ చెప్పిండ్రు. కానీ, 2023 జనవరి 30న సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు కేంద్రం హైడ్రలాజికల్ అనుమతులిచ్చింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనుమతులు వచ్చినయి. అదే విధంగా సీతారామ ప్రాజెక్టుకు 2021, అక్టోబర్ 9న 65 టీఎంసీలతో హైడ్రలాజికల్ అనుమతులు వచ్చినయి. సీతమ్మసాగర్, సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటివరకు మొత్తం 27 రకాల అనుమతులు వస్తే ఇందులో 25 అనుమతులు బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినయి’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
దమ్ముంటే నెలరోజులు అసెంబ్లీ పెట్టు
‘మిస్టర్ రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్ముంటే, ధైర్యముంటే ఒక్కరోజు కాదు.. నెలరోజులు అసెంబ్లీ పెట్టు.. నేను రెడీ.. 15 రోజులు కృష్ణాపై, మరో 15 రోజులు గోదావరిపై మాట్లాడుదాం. నీ కాం గ్రెస్, నీ తెలుగుదేశం, నీ గురువు, నువ్వు చేసిన ద్రోహం.. అన్నీ మాట్లాడుదాం. ఎప్పుడు పెడతవో పెట్టు. నేను డిమాండ్ చేస్తున్నా.. రేపే అసెంబ్లీ పెట్టండి.. మాట్లాడుదాం.. కానీ మైక్ కట్ చేయొద్దు. ఎంత సమయమైనా మాట్లాడు దాం.. వాయిదా వేయొద్దు.. మీరు చెప్పేదంతా చెప్పి.. అసెంబ్లీని వాయిదా వేసి పారిపోతవ్. అలా పారిపోవద్దు.. ఇది నా కండీషన్. మాకు కూడా ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలకు ఎవరి నీతి ఏమిటో తెలియాలి.
చంద్రబాబు కోవర్టులు
‘బనకచర్లపై ఒక ఎమ్మెల్యేగా సూచన చేస్తు న్నా. ఉత్తమన్న లేఖలు రాసుడు కాదు.. తెలంగాణలో బాబు కోవర్టులు ఉన్నారు’ అని స్వ యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డే చెప్పా రు. ఇంటి దొంగలున్నారని ఆయనే చెప్తున్నారు. ఆ కోవర్టులెవరో అందరికీ తెలిసిందే.
తెలంగాణ ద్రోహిగా చరిత్ర పుటల్లోకి రేవంత్‌రెడ్డి
కేసీఆర్ చెప్పినట్టు ముఖ్యమంత్రిగా ఐదేండ్లు రేవంత్.. నువ్వే ఉండాలి. కానీ మంచిపాలన అందించు. ఇప్పటికే తెలంగాణ ద్రోహిగా చరిత్ర పుటల్లోకి ఎక్కినవ్. దాన్ని ఎవడూ చెరపలేడు.. మరుపలేడు. తెలంగాణ ద్రోహుల లిస్టులో మొదట పేరు నీదే ఉంటది. దీన్ని మార్చుకో.. కానీ రాష్ట్ర ద్రోహిగా మిగలకు.. నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేయకు. చిల్లర పనులు మానుకో. కుక్క తోక వంకర అన్నట్టుగా అబద్ధాలు బంద్ చేసి నిజాయితీగా మాట్లాడితే మేం కూడా సహకరిస్తాం. ఎన్నికలకు ఇంకా మూడున్నరేండ్ల సమయం ఉన్నది. అప్పుడు రాజకీయంగా చూసుకుందాం. కానీ ఇప్పుడు ప్రజల కోసం, రాష్ట్రం కోసం పని చేయి.
కిషన్, రేవంత్ మధ్య లవ్
‘కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య ఫెవికాల్ బంధం ఉన్నది. ఒకరిపై ఒకరికి విపరీతమైన లవ్ ఉన్నది. ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నరు. మేడిగడ్డలో 85 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కుంగితే.. మొత్తం కూలిపోయింది.. జల్ది రావాలని కిషన్‌రెడ్డి ఢిల్లీకి ఎన్డీఎస్ఏకు ఉత్తరం రాసిండు. రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏను ఇక్కడికి రప్పించిండు. మరిప్పుడు మొత్తం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది. రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. దీనిపై ఎన్డీఎస్ఏకు కిషన్‌రెడ్డి ఎందుకు ఉత్తరం రాయడం లేదు? ఎన్డీఎస్ఏ ఎందుకు రావడం లేదు? నాడు ఒక్క పిల్లర్ కుంగితే రెండు రోజుల్లో వచ్చిన ఎన్డీఎస్ఏ ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు కూలితే ఎందుకు రాదు? బీజేపీకి, రేవంత్‌రెడ్డికి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటి. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి మధ్య ఉన్న లవ్ ఏమిటి?’ అని హరీశ్ నిలదీశారు.
హెలికాప్టర్ నుంచి నేనైనా దుంకుతా.. లేదంటే నువ్వు దుంకుతవా?
‘ఏడాదికి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని అసెంబ్లీలో గొప్పగా చెప్పినవ్. మరి ఏడాదిన్నర అయితున్నది.. 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి. ఎక్కడొచ్చినయో చూపించు.. హెలికాప్టర్ ఖర్చు నేనే పెడుతా..పోదామా? 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్టు చూపిస్తే హెలికాప్టర్ నుంచి నేను దుంకుతా.. చూపించకపోతే నువ్వు దుంకుతవా?’ అని సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్ చేశారు.
కాంగ్రెస్ విజయాలివిగో!
‘18 నెలల్లో సాగునీటిరంగంలో కాంగ్రెస్ సాధించిన విజయాలు కూడా ఉన్నయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. వట్టెం పంపుహౌస్ మునిగిపోయింది. పెద్దవాగు కొట్టుకుపోయింది. జూరాల రెండు గేట్లు పడిపోయినయి. ఇంతకు మించి కాంగ్రెస్ సాధించిన విజయాలేమైనా ఉన్నాయా? ఉంటే చెప్పండి’ అని హరీశ్ దెప్పిపొడిచారు.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల
పాలనలో 48.74 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించినం. ఇందులో కొత్త ఆయకట్టు 17.24 వేల ఎకరాలు కాగా 31.50 లక్షల ఎకరాలను
స్థిరీకరించినం. ఇదీ మా చిత్తశుద్ధి.. అంకితభావం! మరి రేవంత్‌రెడ్డీ.. నువ్వు వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చినవా? ఒక్క చెరువు కట్టినవా? ఒక్కటైనా చెక్ డ్యాం కట్టినవా? ఒక కాలువ తవ్వినవా? మరి ఈ 20 నెలల్లో ఏం చేసినవ్?
-హరీశ్‌రావు
రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే బనకచర్లపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చెయ్యి.. అసెంబ్లీ సాక్షిగా నీళ్లేందో.. పాలేందో తేలుస్తం. రాష్ట్ర ప్రజల సాక్షిగా, రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఎవరు అబద్ధాలాడుతున్నరో? ఎవరు నిజాలు మాట్లాడుతున్నరో? తేలుద్దాం.. అసెంబ్లీలో మేం మాట్లాడితే మైక్ కట్ చేయొద్దు. కెమెరాలను మావైపు కూడా తిప్పాలె.
-హరీశ్‌రావు