హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తాజాగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన నివేదికలో సూచించినట్టుగా 7వ బ్లాక్‌ను తిరిగి నిర్మించి ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆ పని తొందరగా చేయాలని సూచించారు. రాజకీయాలు ముఖ్యమా? రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? అని నిలదీశారు. ఈ సంవత్సరం ఎస్సారెస్పీలో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాలం కానప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరప్రదాయని అని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం ‘టీ న్యూస్’తో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రజలకు అన్నీ తెలుసని, అన్నింటినీ గమనిస్తుంటారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల అవినీతి అని మంత్రి అంటుండగా, లక్షా యాభైవేల కోట్ల అవినీతి అని మరో మంత్రి చెప్తున్నారని, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.94 వేల కోట్లేనని స్పష్టంచేశారు.
‘కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని ఓ మంత్రి అన్నారు. కానీ, నిన్న సీఎం రేవంత్‌రెడ్డి 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. నిండు శాసనసభలో సాగునీటి రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. అందులో కాళేశ్వరం ప్రాజెక్టులో కొత్త ఆయకట్టు, స్థిరీకరణ కింద 20 లక్షల ఎకరాల్లో పంట పండిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలు, 98 కిలోమీటర్ల పేసర్ మేన్స్, 203 కిలోమీటర్ల టన్నెల్, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు.. ఇలా కాళేశ్వరం అంటే మెగా ప్రాజెక్టు. ఇందులో వందల కంపోనెంట్స్ ఉన్నాయి. అందులో ఒక కంపోనెంట్ మేడిగడ్డ. ఆ మేడిగడ్డలోని 7వ బ్లాక్‌లో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి’ అని హరీశ్‌రావు వివరించారు.
‘మేము ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చినమని రుజువు చేస్తే క్షమాపణ చెప్తావా? ఇవ్వలేదు అంటే నేను ముకు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్న’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు. 2016 మే 27న ఇవాళ రేవంత్‌రెడ్డి ఎకడైతే ముఖ్యమంత్రిగా నియామకం పత్రాలు ఇచ్చారో అకడే మేము నియామక పత్రాలు ఇచ్చాము. ఒక ఇరిగేషన్ శాఖలోనే 1000 ఉద్యోగాలు ఇచ్చాము’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
‘రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తాం అని మాట తప్పారు. నిరుద్యోగ భృతి అన్నారు.. మాట తప్పారు. సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు.. మాట తప్పారు. మీరు ఇచ్చింది 10 వేలలోపు ఉద్యోగాలు మాత్రమే. అశోక్‌నగర్ మెట్ల మీద మీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ. నువ్వు (రేవంత్‌రెడ్డి) నిరుద్యోగులను మోసం చేశారు. పరీక్ష నిర్వహణలోనూ రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యారు’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
‘పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. రేవంత్ కూడా అంతే. ఆనాడు పాలమూరు ఎత్తిపోతల పథకంపై పదుల సంఖ్యలో కేసులు వేసింది ఈ రేవంత్‌రెడ్డే. ఆనాడు కేసులు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నది ఈ రేవంతే. ఆనాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా కేసులు వేసి అడ్డుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీనే. కేవలం రేవంత్‌రెడ్డి చేతగానితనం, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
‘నాడు కేసీఆర్ ఇదే రాష్ట్రంలో 73 శాతం పీఆర్సీ ఇచ్చారు. ఉద్యోగులకు కూడా రైతుబంధు ఇచ్చారు. ఈ రేవంత్‌రెడ్డి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. మేము రాగానే డీఏలు ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారు, ఏమైంది? దేశంలో ఉద్యోగులకు అత్యధిక డీఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ అయింది. 100 రోజుల్లో అన్నీ చేస్తాం అన్నారు. 500 రోజులు అన్నారు.. ఏమైంది? రైతుల విషయంలో, ఉద్యోగుల విషయంలో రేవంత్‌రెడ్డి పగ బట్టారు. లక్షల కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు? మరి రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఏమైంది?’ అని హరీశ్‌రావు నిలదీశారు.
‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాతావరణశాఖ హెచ్చరిక రాగానే మంత్రులను, అధికారులను అలర్ట్ చేసేవారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది.. రైతుల ధాన్యం తడిసిపోతుంది వారికి కవర్లు అందజేయండి. కొన్న వడ్లను వెంటనే తరలించండి అని ఆదేశాలిచ్చేవారు. అందాల రాశుల గురించి ఆలోచన చేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి.. అన్నదాతల ధాన్యం రాశుల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు? అందాల పోటీలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రివ్యూ చేస్తారు కానీ అన్నదాత అరిగోసపై రివ్యూ ఎందుకు చేయరు?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘తెలంగాణ ఆడబిడ్డలతో దేశవిదేశాల నుంచి వచ్చిన అందాల భామల కాళ్లు కడిగించడం దుర్మార్గపు చర్య. తెలంగాణ అడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం క్షమించరాని నేరం. ఈ ప్రభుత్వం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేస్తా అన్నారు. వారంతా ఎకడ ఉన్నారు? వడ్డీ లేని రుణాలు అన్నావు. ఎకడ ఇచ్చారు? ఇవాళ వడ్డీలు మహిళా సంఘాలు కడుతున్నాయి’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.