సిద్దిపేట, డిసెంబర్ 24( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో విద్యుత్ సరఫరా మీద చర్చ పెట్టాలని అని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తాము సబ్‌స్టేషన్‌కు వచ్చిన లాగ్‌బుక్ చూశామని అధికారుల మీద చర్యలు తీసుకోకు.. నిజాయితీ ఉంటే రైతులకు 24గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్ఎస్ సమావేశానికి వెళ్తుండగా, కరెంట్ సరిగా లేదని రెడ్డిపల్లి, మద్దూరు గ్రామాల రైతులు ఫోన్ చేసి చెప్పడంతో పట్టణంలోని 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.
లాగ్ రికార్డులను పరిశీలించారు. ‘మాకు 12గంటలు మాత్రమే కరెంట్ వస్తున్నది. పొలానికి నారుబోసే టైం ఇది. ఇలా అయితే ఇబ్బంది అవుతుంది’ అని రైతులు తనకు ఫోన్ చేస్తే నిజమా? సమస్య ఏమిటో తెలుసుకుందామని వచ్చానని హరీశ్‌రావు చెప్పారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి 24గంటలు కరెంటు ఇస్తున్నమంటున్నం అని చెబుతున్నడని.. రెడ్డిపల్లి, మద్దూరు గ్రామాల్లో 12గంటలు, 13 గంటలు మాత్రమే సరఫరా కావడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు.
నారు దశలోనే తక్కువ కరెంట్ వస్తే మున్ముందు పంటలు పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. సబ్‌స్టేషన్‌లో లాగ్ బుక్‌లో కూడా 12గంటల కరెంటు మాత్రమే ఉన్నదని, మరో రోజు పరిశీలిస్తే సాయంత్రం 5గంటలకు పోయి తెల్లవారుజామున 3గంటలకు వచ్చిందని తెలిపారు. అంటే సగటున 12, 13 గంటల కరెంటు మాత్రమే వస్తుందనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజాయతీ ఉంటే 24గంటల విద్యుత్ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. నాడు, నేడు కాంగ్రెస్ పాలనలో కరెంటుతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు కరెంటుకు మేమే చాంపియన్, 24గంటల కరెంటుకు మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పిండు. మరి 12గంటలే ఎందుకు వస్తుంది. ఊరికే ప్రతిపక్షాల మీద బురద జల్లడం కాదు దమ్ముంటే అసెంబ్లీలో కరెంటు సమస్యలపై చర్చ పెట్టు. హామీలు ఎగ్గొట్టుడు.. కోతలు పెట్టుడు కాదు.
– హరీశ్‌రావు
కేసీఆర్ అంటేనే 24గంటల కరెంటుకు బ్రాండ్. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుల కోసం 24గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చింది బీఆర్ఎస్ సర్కారే. మీరు వచ్చాక రైతులకు 12 , 13 గంటలు కూడా రావడం లేదు. 13గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని, ఉదయం 4గంటలకు కరెంట్ ఇస్తామని వ్యవసాయశాఖ అధికారులకు, రైతులకు విద్యుత్తు శాఖ అధికారులే
మెసేజ్‌లు పెడుతున్నరు.
– హరీశ్‌రావు