సంగారెడ్డి, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) : కేసీఆర్ అసలైన నాయకుడైతే, రేవంత్‌రెడ్డి డూప్లికేట్ నాయకుడని.. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బరాబర్ అసలైన బీఆర్ఎస్ను గెలిపించి, నకిలీగాళ్లకు కర్రుకాల్చి వాతపెడతారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని, తెలంగాణ కోసం ఎన్నడూ కొట్లాడలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన నాయకుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని గుర్తుచేశారు. రూ.2వేల పింఛన్, రూ.10వేల రైతుబంధు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతుబీమా, సాగునీరు, తాగునీరు ఇచ్చి చూపించారని వివరించారు. కానీ రేవంత్‌రెడ్డి రెండేండ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఎగ్గొట్టాడని.. మరి ఎవరు అసలో, ఎవరు నకిలీయో ప్రజలకు అర్థమైంది పేర్కొన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని ఆరు పట్టణాల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. సంగారెడ్డి సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎవ్వరూ నమ్మడం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి అసలు-నకిలీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని భూపాలపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుడు కరెక్టే. రెండేండ్లలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చక డూప్లికేట్ సీఎంగా మిగిలిపోయాడు. తులం బంగారం, మహిళలకు రూ.2500, పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్.. ఇలా అన్నీ ఎగ్గొట్టిన నువ్వు డూప్లికేట్ సీఎం అని ప్రజలకు అర్థమైంది. బరాబర్ నువ్వు అన్నట్టే అసలైన బీఆర్ఎస్ను గెలిపించి, నకిలీగాళ్లకు వాతపెడ్తరు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు గుంతలమయమై ప్రజలు కష్టాలు పడుతుంటే రేవంత్‌రెడ్డి కండ్లకు మాత్రం గంతలు కట్టుకున్నారని హరీశ్‌రావు దుయ్యబట్టారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్, బచ్చుగూడ, ఇస్నాపూర్‌లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేదు కానీ రేవంత్‌రెడ్డి భాష మాత్రం వీధి రౌడీలా మారిందని మండిపడ్డారు. గల్లీల్లో మోరీల కంటే రేవంత్‌రెడ్డి నోటి నుంచి వచ్చే మురికి మాటలే ఎక్కువ కంపుకొడుతున్నాయని ఎద్దేవా చేశారు. మున్సిపాలిటీల్లో చెత్త కూడా తొలగించలేని చెత్త ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి ఉండాల్సిన పద్ధతి ఇదేనా? ఇంత వెకిలిగా ప్రవర్తించటాన్ని ఎవరైనా మెచ్చుకుంటారా అని ప్రశ్నించారు. బూతుల ముఖ్యమంత్రికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అన్నంపెట్టే కేసీఆర్ కావాలా, సున్నం పెట్టే రేవంత్‌రెడ్డి కావాలో ప్రజలు తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి పాలనలో పేదలకు స్కీములు బంద్ అయ్యాయని.. కాంగ్రెస్ నాయకుల స్కాములు మాత్రం ఫుల్లుగా నడుస్తున్నాయని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలనలో పచ్చితనమే తప్ప ఎక్కడా పచ్చదనం కనిపించడం లేదని ధ్వజమెత్తారు. తండ్రి వయస్సు ఉన్న కేసీఆర్‌ను పట్టుకుని రేవంత్‌రెడ్డి కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే ఇంటి బిల్లులు రావు పర్మిషన్లు రావని కాంగ్రెస్ నాయకులు బెదిరించడంపై మండిపడ్డారు. ఓట్లు వేస్తేనే మున్సిపాలిటీలకు నిధులు ఇస్తామని రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. మున్సిపాలిటీలకు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వస్తాయని అవి ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండవని చెప్పారు. కాంగ్రెస్ బెదిరింపులకు ఎవరూ భయపడకుండా ప్రజలంతా బీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వల్లే అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కిందని, అయితే ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాడో లేదో తెలియదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో మైనారిటీ మంత్రి లేడని ఇదే విషయాన్ని బీఆర్ఎస్ పదే పదే ప్రశ్నించడం వల్లే కాంగ్రెస్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చిందని చెప్పారు. అందుకు అజారుద్దీన్ తన చాంబర్లో కేసీఆర్ ఫొటో పెట్టుకోవాలని సూచించారు. అజారుద్దీన్‌కు రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఇవ్వకపోతే మూడు నెలల్లో మంత్రి పదవి ఊడిపోతుందని తెలిపారు. బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని, కేసీఆర్ పాలనలో మైనారిటీల అభ్యున్నతికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్టు గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో మతఘర్షణలు చోటు చేసుకోలేదని, కానీ రేవంత్ సర్కార్ వచ్చాక 60 ఘర్షణలు జరిగినట్టు చెప్పారు. ఎంఐఎం పార్టీ మహారాష్ట్రలో బీజేపీతో, తెలంగాణలో కాంగ్రెస్‌తో అంటకాగుతున్నదని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటు వేయడం అంటే వృథాయేనని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు శివకుమార్, ఎంఏ హకీం, కాసాల బుచ్చిరెడ్డి, మామిళ్ల రాజేందర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఒకే రోజు 15 ప్రచారసభలో పాల్గొని హరీశ్‌రావు రికార్డు సృష్టించారు. సంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పర్యటించి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున సుడిగాలి ప్రచారం చేయడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఆదివారం ఉదయం 9గంటలకు పటాన్చెరు నియోజకవర్గంలోని బచ్చుగూడ నుంచి ప్రచా రం ప్రారంభమైంది. ఆ తర్వాత ఇస్నాపూర్ సభలో పాల్గొన్నారు. అనంతరం సదాశివపేటలో మూడు చోట్ల, కోహీర్‌లో రెండు చోట్ల, జహీరాబాద్‌లో మూడుచోట్ల నిర్వహించిన ప్రచారసభల్లో పాలుపంచుకున్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో నిర్వహించిన ఐదు ప్రచార సభల్లో హరీష్‌రావు ప్రసంగించారు. రాత్రి 10గంటలకు సంగారెడ్డిలోని ప్రచారం ముగిసింది. హరీశ్‌రావు హుషారెత్తించే ప్రసంగాలతో గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది.