నెట్వర్క్, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివలింగాలను దర్శించుకొని భక్తులు పరవశించిపోయారు. పలు దేవాలయాల్లో ప్రముఖులు పూజలు చేశారు. హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో బుధవారం రాత్రి ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి ఆధ్మాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు హాజరయ్యారు.
ఆయన వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేశ్‌రెడ్డి ఉన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మాజీ ఎంపీ వినోద్‌కుమార్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబసభ్యులు పూజ లు, అభిషేకం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆలయ పరిధిలో మొకలు నాటారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మహాశివరా త్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీశైలంలో శివస్వాములు, భక్తులతో ఆలయం కిక్కిరిసింది. బుగ్గరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం సుమారు ఐదు కిలోమీటర్ల మేర భక్తులు క్యూకట్టారు.