హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ): ‘అవమానాలను భరించి.. పదవులను గడ్డిపోచలా త్యజించి.. ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణను తెచ్చింది కేసీఆరే’ అంటూ మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఆయన ఒక వ్యక్తికాదని, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల భావోద్వేగమని అభివర్ణించారు. ఆ కారణజన్ముడి జన్మదినం మనకందరికీ పండుగ దినమని పేర్కొన్నారు. ‘ఆ మహానుభావుడు పుట్టినరోజు ఫిబ్రవరి 17కు ఎంతటి ప్రాధాన్యమున్నదో.. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో.. అయితే తెలంగాణ జైత్రయాత్ర..లేదంటే నా శవయాత్ర అని ప్రతినబూని ఆమరణదీక్షకు పూనుకున్న నవంబర్ 29కి కూడా అంతే ప్రాధాన్యమున్నది’ అని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన కేసీఆర్ బర్త్‌డే వేడుకల్లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పుట్టిన రెండేళ్లకే కాంగ్రెస్ 1956లో తెలంగాణను ఆంధ్రాలో కలిపిందని గుర్తుచేశారు. ఆయన పదహారేండ్ల వయస్సులోనే 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు.
ఆయనకు ఆంధ్రాపార్టీల్లో పనిచేసినా నిత్యం తెలంగాణ ప్రయోజనాల కోసమే పరితపించారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపేవారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో పెంచిన విద్యుత్తు చార్జీలు తెలంగాణ ప్రజల పాలిట ఉరితాళ్లని నిలదీశారని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను భరించలేకే వందలు, వేల గంటల పాటు మేధోమథనం చేసి ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారంచుట్టారని గుర్తుచేశారు. ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే అనే అపవాదు ఉన్నరోజుల్లో, డిప్యూటీ స్పీకర్, పార్టీ కార్యదర్శి, ఎమ్మెల్యే పదవులను వదిలిపెట్టి ప్రత్యేక పోరును తనదైన పంథాల్లో ముందుకు తీసుకెళ్లారని, అందుకే ఆయన చిత్తశుద్ధిని జయశంకర్‌సార్‌తో పాటు అనేక మంది మేధావులు ప్రశంసించేవారని తెలిపారు. 2001 నుంచి ఆ మహోన్నతుడి నాయకత్వంలో పనిచేసే అవకాశం తనకు కలుగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
మొండిపట్టుదలతో రాష్ట్ర సాధన
ఉద్యమసమయంలో అనేకమంది నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా కుంగిపోకుండా పట్టుదలతో రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని హరీశ్ కొనియాడారు. కేసీఆర్ నాడు పదవులకు ఆశపడో.. అధైర్యపడో వెనుకడుగు వేసి ఉంటే ఈ రోజు మనం తెలంగాణలో ఉండకపోయేవాళ్లమని చెప్పారు. కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధమైన ఫలితంగానే కాంగ్రెస్ 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు పక్రియ ప్రారంభించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మధ్యలో దోఖాచేసినా వెరవకుండా పట్టుబట్టి ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ధీశాలి కేసీఆర్ అని కిర్తీంచారు.
పైసల కోసమే రేవంత్ 20-20 మ్యాచ్‌లు
మారిన రాజకీయ పరిస్థితుల్లో 20-20 మ్యా చ్‌లు ఆడుతున్నానని సీఎం రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని, ఆయన పైసల కోసమే తొండి మ్యాచులు ఆడుతున్నారని హరీశ్ దు య్యబట్టారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా పదవిలో ఉండగానే కమీషన్లు, కలెక్షన్లకు తెరలేపారని దుయ్యబట్టారు. నీళ్ల విషయం, హామీల అమలులో తొండి మ్యాచ్‌లు ఆడుతున్న ఆయన, డబ్బులు కొల్లగొట్టడంలో మాత్రం 20-20 మ్యాచ్‌లు ఆడుతున్నారని ఎద్దేవాచేశారు. ఆయన ఏ మ్యాచ్ ఆడినా కేసీఆర్‌కు ఏ మ్యాచ్ ఆడాలో తెలుసని, టెస్ట్, వన్డే, ట్వంటీ ట్వంటీ ఏదైనా గొప్పగా ఆడగలిగే నైపుణ్యం కేసీఆర్ సొంతమని, అవసరమైతే ఢిపెన్స్ అడతారని, సిక్స్ కొడతారని చమత్కరించారు. ఇప్పుడు కూలీ నుంచి రోడ్లమీద పోయేవారినెవరిని కదిలించినా కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణతో కేసీఆర్‌ది పేగుబంధం
పోరాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ కంటికిరెప్పలా కాపాడుకున్నారని హరీశ్ చెప్పారు. పదేండ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం పరితపించి రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని గుర్తుచేశారు. సాగు, తాగునీరు, కరెంట్ ఇలా అన్నింటా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు ఉన్నది తల్లీబిడ్డల పేగుబంధమని అభివర్ణించారు. అందుకే ప్రతిక్షణం రాష్ట్ర అభ్యున్నతికోసం కేసీఆర్ పరితపిస్తుంటారని పునరుద్ఘాటించారు.