హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని కాపాడటానికి కనీసం హెలికాఫ్టర్ తెప్పించలేని అసమర్థులు మన ముఖ్యమంత్రి, మంత్రులు అంటూ విరుచుకుపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి ఒక హెలికాఫ్టర్ తీసుకరాలేని మంత్రి పొంగులేటి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావుతో కలిసి జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరదల్లో చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాగా రూ.25 లక్షలు చెల్లించాలని గతంలో డిమాండ్ చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు అమలు చేయాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో 20 జిల్లాల్లో వర్షం ప్రభావం ఉందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సగటున 45 సెంటిమీటర్లకు పైగా వర్షం పడుతుంటే.. ఆదివారం రోజంతా ఎక్కడా కనిపించని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని, అంత రహస్య సమావేశాలు, చర్చలు ఏమిటో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని, గంటల తరబడి బాధితులు సహాయం కోసం చూశారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. వరదలపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో ఒక రాజకీయ పదం కనిపించిందా? కోదాడలో ఎవరి హయాంలో కబ్జాలు జరిగాయో ఉత్తమ్ తో చర్చకు సిద్ధమని చెప్పారు.
ప్రజలే రెస్యూ ఆపరేషన్ చేసుకొని ప్రాణాలు కాపాడుకున్నారని, హెలికాప్టర్ కోసం ప్రయత్నించినా రాలేదని చెప్తున్న మంత్రి తక్షణం రాజీనామా చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. హెలికాప్టర్ రాకుంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో మాట్లాడకుండా నిన్న ఏం చేశారని నిలదీశారు. సైనిక విమానం 45 నిమిషాల్లో ఖమ్మంకు చేరుకునేదని, ప్రాణాలను కాపాడేదని అభిప్రాయపడ్డారు. ఒక మంత్రి హెలికాప్టర్ కోసం ఏపీ సీఎంతో మాట్లాడాను అని చెప్తున్నారని, ఆయన తెలంగాణ సీఎంతో ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. ఆ మంత్రికి ఏపీ సీఎం దొరికాడు తప్ప తెలంగాణ సీఎం దొరకలేదా అంటూ నిలదీశారు. సీఎంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాట్లాడితే తెలంగాణకు హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదని సందేహం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. భువనగిరి, కోదాడ, నల్లగొండ, ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి హెలికాప్టర్ దొరుకుతుందని, కానీ ప్రజలను రక్షించేందుకు దొరకదా అంటూ ఈ ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హకు లేదని, వర్షాలతో సంభవించిన మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.