తొర్రూరు సెప్టెంబ 02 : కాంగ్రెస్ అంటేనే మోసం.. రేవంత్ అసమర్థ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్నారని అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. కేసీఆర్‌పై సిబిఐ అక్రమ కేసును ఖండిస్తూ మహబూబబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ చౌరస్తా వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ..కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ. సొరంగాలు, 1531 కి.మీ. గ్రావిటీ కెనాల్, 141 టీఎంసీ ల స్టోరేజ్ సామర్థ్యంతో నిర్మించిన మహత్తర ప్రాజెక్టు అన్నారు.
ఒక బ్యారేజ్‌లో మూడు పిల్లర్లు కుంగితే మొత్తం ప్రాజెక్టు వృథా అయిందని చెప్పడం అబద్ధం అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందుతున్న నీళ్లు కాళేశ్వర జలాలే అన్న విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దు అని స్పష్టం చేశారు. అదేవిధంగా కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును ఎండబెట్టడమేనని పేర్కొన్నారు. అసెంబ్లీలో మా బీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఘోష్ కమిషన్ కూడా మేడిగడ్డ రిపేర్ చేయాలని చెప్పింది.
దాదాపు 150–200 కోట్లు ఖర్చవుతుంది. అది కూడా నిర్మాణ సంస్థే భరిస్తుంది. అయినప్పటికీ ఎందుకు రిపేర్ చేయడం లేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చుకుంది నీళ్ల కోసం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఆంధ్రాకు తరలిస్తూ మన రైతులను గోసపడే రోజులు తెస్తోందని మండిపడ్డారు. నాడు కేసీఆర్ రైతులకు యూరియా బస్తాలు ఇచ్చారు. నేడు రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి డబ్బుల బస్తాలు మోస్తున్నారు అని ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.