పర్వతగిరి, సెప్టెంబర్ 18: రైతులను నిండాముంచిన కాంగ్రెస్ ధోకా సర్కార్ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. బుధవారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు పరిధిలో 600 మంది రైతులు రూ.6 కోట్ల రుణం తీసుకుంటే కేవలం 200 మంది రైతులకు రూ. కోటీ 30 లక్షలు రుణమాఫీ అమలైందని సిబ్బంది తెలిపారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని, రుణమాఫీ చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను మోసగించడం తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయడంలేదని వాపోయారు. రైతుబంధుకు రాంరాం చెప్పి.. రుణమాఫీ పేరుతో అనేక ఆంక్షలు విధించి రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రైతన్నలకు సూచించారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మాజీ ఎంపీటీసీలు మాడుగుల రాజు, కర్మిళ్ల మోహన్‌రావు, మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్, ఏర్పుల శ్రీనివాస్, అమడగాని రాజు, బానోతు వెంకన్న పాల్గొన్నారు.
రుణమాఫీ చేయకుంటే సచివాలయం ముట్టడిస్తాం
మిరుదొడ్డి, సెప్టెంబర్ 18: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన రైతులందరికీ వందశాతం పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి తహసీల్ కార్యాలయం ఎదుట బుధవారం వందలాది మంది రైతులు బైఠాయించారు. 10 గ్రామాలకు చెందిన వెయ్యి మందికి పైగా రైతులు ధర్నా నిర్వహించారు. రుణమాఫీ కాని 780 మంది రైతుల జాబితాను డిప్యూటీ తహసీల్దార్ వీరేశ్‌కు అందజేశారు.
ఏవేవో కొర్రీలు పెట్టి తమకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాకులు మాని వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపారు. వందశాతం రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి కలెక్టరేట్, సచివాలయం ముట్టడిస్తామని ఫోన్లో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ సర్పంచులు బాల్‌రాజు, బాల్‌నర్సయ్య, రైతు విభాగం మండలాధ్యక్షుడు దుర్గారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.