సంగెం, ఆగస్టు 24 : సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తిలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాయమాటలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. శాసనసభ, పార్లమెంటు ఎన్నికల ముందు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని రేవంత్రెడ్డి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి, ఇప్పుడు మాఫీ చేయకుండా రైతులను మోసం చేసిండని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆయన, 40 శాతం మందికి ఇంకా మాఫీ కాలేదన్నారు. పొరపాటు చేశామని మంత్రులు కూడా ఒప్పుకున్నారని తెలిపారు. కాళేశ్వరం, దేవాదుల నీళ్లు లేవని, 24 గంటల కరెంటు ఇస్తలేరని, ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేశామని ప్రజలు బాధపడుతున్నట్టు చెప్పారు. అర్హులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కాపులకనపర్తి సొసైటీలో 1907 మందిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదని అన్నారు. అదే సొసైటీలో పేరాల సాంబయ్య అనే రైతు రూ.లక్ష చెల్లిస్తే రసీదు ఇచ్చారు కానీ బ్యాంకులో జమచేయలేదని, అందుకు కారకులైన చైర్మన్, సీఈవో, ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మాఫీ చేసి.. మాట నెలబెట్టుకోవాలి: చల్లా
రైతులందరికీ రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన మాట్లాడారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసేదాకా రైతుల పక్షాన బీఆర్ఎస్ రణం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు ఇష్టానుసారంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడితే సహించేది లేదని అన్నారు.