దేవరుప్పుల, ఆగస్టు 20: ‘మాయమాటలతో గెలిచిన రేవంత్రెడ్డి రుణమాఫీ విషయంలో అంకెల గారడీ చేసి మాఫీ పూర్తయిందని సంబురాలు చేసుకుంటుండ్రు. తీరా సగం మందికి కూడా రుణమాఫీ కాక రైతులు గోస పడుతుండ్రు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండ్రు. వ్యవసాయ పనులు వదిలి చేతుల్లో కాగితాలు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతుండ్రు. ఎంత అప్పు ఉన్నా రూ.2 లక్షలే మాఫీ అయితది. మిగితావి కడితేనే మాఫీ వర్తిస్తుందని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తే పుస్తెల తాళ్లు అమ్మి రైతులు లోన్లు కడుతుండ్రు. బ్యాంకులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి అన్నదాతల ఉసురు తగులుతది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో బ్యాంకు ఎదుట రైతులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. రుణమాఫీపై వాయిదాల మీద వాయిదాలు పెట్టడంతో రైతులంతా ఎదురుచూస్తున్నారని, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీ తడిసి మోపెడవుతున్నదని చెప్పారు. రుణమాఫీ ఎగ్గొట్టాలని ఈ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. రుణమాఫీ పూర్తి చేశామని రేవంత్రెడ్డి ఖమ్మంలో సంబురాలు చేసుకున్నారని, మాఫీ మరికొందరికి చేయాల్సి ఉందని మంత్రులు అంటున్నారని, ఇందులో ఎవరిని నమ్మాలో తెలియడం లేదని దుయ్యబట్టారు. రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు ప్రభుత్వాన్ని విదలిపెట్టేది లేదని, రైతులంతా బీఆర్ఎస్తో కలిసి రావాలని స్పష్టంచేశారు.