తొర్రూరు, జనవరి 18: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరేస్తామని జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందంజలో ఉందంటే.. దానికి కారణం కేసీఆరేనని స్పష్టంచేశారు.
తొర్రూరు మండలాన్ని మున్సిపాలిటీగా మార్చి.. పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తొర్రూరు మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ తూర్పాటి సుభద్రాశంకర్, సీనియర్ నాయకులు నమిళ్ల విజయభాసర్, జాటోత్ వీరన్న, జాటోత్ వెంకన్న తదితరులు ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.