హుస్నాబాద్, నవంబర్ 25: భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పీవీ నర్సింహారావును ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీకి అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ పుట్టగతులుండవని రాజ్యసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రి కెప్టెన్ వొడితెల లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సుస్థిర పాలన అందించి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీని.. ఆయన మరణానంతరం కాంగ్రెస్ పార్టీ ఏమాత్రమూ పట్టించుకోలేదని విమర్శించారు. కనీసం ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయానికి కూడా రానీయలేదని, ఒక అనాథ శవంలా హైదరాబాద్‌కు పంపి తీవ్రంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల హుస్నాబాద్ సభకు వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పీవీ నర్సింహారావు పేరును ప్రస్తావిస్తూ.. ‘పీవీ మా వాడు. ఆయన ఆశయాలను కొనసాగిస్తాం.. హుస్నాబాద్‌ను అభివృద్ధి చేస్తాం’ అని చెప్పడం వారి నీతిమాలిన తనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.
అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ పీవీ అంత్యక్రియలు ఘనంగా జరిపించకపోవడం.. ఈ ప్రాంతంతోపాటు ఇక్కడి నాయకులపై కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకున్న వివక్షను గుర్తుచేసిందని చెప్పారు. పీవీతోపాటు ఆయన కుటుంబాన్ని గౌరవించింది కేవలం సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. పీవీ జీవిత చరిత్రను ‘నమస్తే తెలంగాణ దినపత్రి’లో ప్రచురించి ప్రజలకు తెలియజేయడంతోపాటు ఆయన కుమార్తెను ఎమ్మెల్సీ చేసిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. పీవీ స్మృతివనం, మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు.