ఆదిలాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సూచించారు. రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని, ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేలు అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం జైనథ్ మండలంలోని భోరజ్ వద్ద జాతీయ రహదారిపై రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్లకార్డుల ద్వారా ప్రదర్శించారు. ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆందోళన చేస్తుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న పోలీసులను ప్రశ్నించారు.
రైతులను మోసం చేసిన కాంగ్రెస్
రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎకరాకు కేవలం రూ.12 వేలు ఇస్తామని ప్రకటించడం మోసం చేయడమన్నారు. ఇప్పటికే విడుతలుగా రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పలు షరతులు విధిస్తూ పథకం అమలు చేస్తామని చెప్పడం హస్యాస్పదమన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రైతులకు మొండిచేయి చూపిన కాంగ్రెస్ రైతు భరోసా విషయంలో మరోసారి రైతులకు అన్యా యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏడాది గడిచినా హామీకి దిక్కులేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షా న బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తూంటే ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి అరెస్టులు చేయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యాసం నర్సింగరావు, విజ్జిగిరి నారాయణ, మార్సెట్టి గోవర్ధన్, లింగారెడ్డి, గణేశ్ యాదవ్, విజయ్, చందాల రాజన్న, వెంకట్ రెడ్డి, సతీశ్, రాంరెడ్డి, భోజన్న, పురుషోత్తం, దేవన్న, గంగన్న, కస్తాల ప్రేమల, స్వరూపరాణి, పర్వీన్, కరుణ, ప్రశాంత్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ రైతులకు చేసిందేమి లేదు..
రైతు ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమి లేదు. నాకు మూడు ఎకరాల భూమి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధుతో ఇబ్బందులు లేకుండా రెండు పంటలు వేశా. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అర్హులకు మొండిచేయి చూపింది. ఇప్పుడు రైతుభరోసా ఎకరాకు రూ.12 అంటు న్నారు. అందరూ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.
-భూమారెడ్డి, రైతు, ఆనంద్పూర్, జైనథ్
ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలి..
నాకు ఐదెకరాల భూమి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ రైతుబంధు ఇవ్వడంలో రైతుల కష్టాలు దూరమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్ని చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదు. రైతు భరోసాలో ఎకరాకు రూ. 15 వేల పంట పెట్టుబడి ఇస్తామని అన్నారు. ఇప్పటికే రెండు పంటలకు ఇవ్వలేదు. ఇప్పుడు ఎకరాకు రూ.12 వేలు అంటున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రూ. 15 వేలు ఇవ్వాలి.
– జిట్ట అశోక్, రైతు, ఆడ, జైనథ్ మండలం