చిన్నకోడూర్, ఏప్రిల్ 6: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై వివక్ష చూపుతున్నదని, కక్షపూరితంగానే ఈ మెగా ప్రాజెక్టును ఎండబెడుతున్నదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం కాల్వ నుంచి మైలారం జాలి చెరువు బికబండ కుంటకు సొంత డబ్బుతో హరీశ్‌రావు ఇటీవల కాల్వను తవ్వించారు. ఆదివారం రైతుల సమక్షంలో పైపులైన్ ద్వారా చెరువులోకి ఆయన నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వివక్షాపూరితంగానే.. కాళేశ్వరం ప్రాజ్టెకు కింద కొత్తగా ఒక ఎకరా భూసేకరణకు నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు.
ఈ వైఖరితోనే ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం రిజర్వాయర్లలో పుషలంగా నీళ్లున్నా నీటి విడుదలలో నిర్లక్ష్యం చూపుతుందని మండిపడ్డారు. ప్రభుత్వం నిధులు ఇవ్వక పోవడంతో రైతులే సొంతంగా కాల్వలు తవ్వుకునే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాల్వల నిర్మాణం, నీటి పంపింగ్ చేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మిడ్ మానేరులో నీళ్లున్నా.. కుట్రతోనే విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ నాడు కాళేశ్వరం మెగా ప్రాజెక్టును నిర్మించి, సిస్టం అంతా రెడీ చేసినట్టు తెలిపారు. కేవలం భూసేకరణ చేసి కాల్వలు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వాల్సి ఉండగా, అది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు.
మైలారం జాలిచెరువు, కొండెంగులకుంట, బికబండ పరిధిలో నీళ్లులేక పంటలు ఎండుతున్నాయని ఇటీవల తనతో రైతులు మొరపెట్టుకున్నారని, పంటలు ఎండిపోవద్దని ఉద్దేశంతో తన సొంత డబ్బుతో కాల్వ పనులు చేయించినట్టు తెలిపారు. కండ్ల ముందు పంటలు ఎండుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. ఎలాంటి జాప్యం చేయకుండా కుంగిన ఒకటో, రెండో పిల్లర్లను మరమ్మతులు చేసి కాళేశ్వరం నీళ్లిచ్చి పంటలు కాపాడాలని హరీశ్‌రావు కోరారు. కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పాపయ్య, పరకాల మల్లేశంగౌడ్, సత్యనారాయణరెడ్డి, మేడికాయల వెంకటేశం, పోచబోయిన శ్రీహరియాదవ్, పెట్టబోయిన శ్రీనివాస్, కాల్వ ఎల్లయ్య, ఏంరెడ్డి భూమిరెడ్డి, జంగిటి శ్రీనివాస్, కొండం రవీందర్‌రెడ్డి, ముకెర శ్రీనివాస్, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.
పదేండ్ల ప్రగతిని ఏడాదిలో దెబ్బతీశారు
బీఆర్ఎస్ పాలనలోని పదేండ్ల ప్రగతిని నేడు కాంగ్రెస్ సర్కారు ఏడాదిలోనే దెబ్బతీసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో విమర్శించారు. 2024-25లో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల ఆదాయంలో తగ్గుదలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం అనాలోచిత విధానాలతో రాష్ట్రం అధోగతి పాలవుతున్నదని మండిపడ్డారు.ఉ బీఆర్ఎస్ హయాంలో కొవిడ్ కాలం మినహా రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక వృద్ధిరేటు 25.62 శాతం ఉండేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1.93 శాతం తగ్గిందని తెలిపారు. హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీయడంతోనే ఆదాయంలో తగ్గుదల నమోదైందని తెలిపారు. నాడు వేగంగా ఎదిగిన తెలంగాణ.. కాంగ్రెస్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలతో నేడు వెనుకబాటుకు గురయ్యే పరిస్థితి దాపురించిందని దుయ్యబట్టారు.