రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్లలో సెస్ కొనసాగుతుందా లేదా? అన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సెస్ రద్దు చేయాలని యోచిస్తే వినియోగదారులు, మేధావులు, సెస్ పాలకవర్గ సభ్యులు కలిసి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సెస్‌ను కాపాడేందుకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తున్నదని స్పష్టంచేశారు.
సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మార్చి 31తో లైసెన్స్ గడువు ముగిసినా ఇప్పటివరకు సెస్ పునరుద్ధరణ కాకపోవడంతో వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నదని అన్నారు. రేవంత్ ప్రభుత్వం సెస్ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదంటూ ఘాటు విమర్శలు చేశారు. సెస్ నష్టాల్లో లేదని, రాష్ట్ర ప్రభుత్వమే సుమారు రూ.700 కోట్లు బకాయి ఉన్నదని సూచించారు. మంత్రులు భట్టి, తుమ్మల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.